‘హిట్ అండ్ రన్’ చట్టంపై డ్రైవర్ల ఆందోళన.. పలు రాష్ట్రాల్లో పెట్రోలు పంపుల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాల క్యూ.. వీడియో ఇదిగో!

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ఉదయం పెట్రోలు బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలు కనిపించాయి. పెట్రోలు, డీజిల్ కోసం వాహనదారులు ఒక్కసారిగా పోటెత్తడంతో చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెట్రోలు బంకులన్నీ ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిడిపోయాయి. కేంద్రం తీసుకొస్తున్న కొత్త శిక్ష చట్టంలోని కఠినమైన ‘హిట్ అండ్ రన్’ నిబంధనకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ట్రాన్స్‌పోర్ట్ అసియేషన్‌తోపాటు డ్రైవర్లు ఆందోళనకు దిగడమే ఇందుకు కారణం. ట్యాంకులు ఫుల్ చేయించుకునేందుకు వాహనదారులు బారులుదీరారు.

బ్రిటిష్ కాలం నాటి పాత శిక్ష చట్టం స్థానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంలో ప్రమాదం చేసి పారిపోయినా (హిట్ అండ్ రన్), ఘటనకు సంబంధించిన సమాచారంపై ఫిర్యాదు చేయకున్నా పదేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. దీనిపై డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్లు ఆందోళనకు దిగడంతో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వాహనాలు, ట్రక్కులు, ట్యాంకర్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రజలు సొంతవాహనాలను బయటకు తీసి ట్యాంకులు నింపుకుంటున్నారు.

హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోడ్లను దిగ్బంధించడంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఇండోర్‌లో డ్రైవర్లు ముంబై-ఆగ్రా జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో నిత్యావసర సరుకుల రవాణా నిలిచిపోయింది. చత్తీస్‌గఢ్‌లోనూ ప్రైవేటు బస్సులు, ట్రక్కులు నిలిచిపోయాయి. కొత్త చట్టంలో ప్రతిపాదిత సెక్షన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు ఆందోళనకు దిగారు.

Leave A Reply

Your email address will not be published.