నేరుగా ఫోన్ లైన్‌లోకి మంత్రి కొండా సురేఖ
సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు
సీఎం ఆశయాలకు అనుగుణంగా నూతన కార్యక్రమం
జనం చెంతకు చేరిన ప్రజా ప్రభుత్వం
లైన్‌లోకి వచ్చిన వందలాది ఫోన్ కాల్స్
రెవెన్యూ, డ్రైనేజీ, పెన్షన్ల సమస్యలపై వినతులు
హైదరాబాద్ వెలుతురు జులై 20 :
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గర కావాలనే లక్ష్యంతో సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, జవాబుదారీతనంతో కూడిన పాలనను అందించే క్రమంలో “డయల్ యువర్ ఎమ్మెల్యే” అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజల నుంచి ఊహించని రీతిలో భారీ స్పందన లభించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లబ్ధిదారులకు, పాలకులకు మధ్య ఉన్న దూరం పూర్తిగా తగ్గిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ స్వయంగా ఫోన్ కాల్స్‌లో అందుబాటులోకి వచ్చి ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వందలాది మంది ప్రజలు మంత్రికి ఫోన్ చేసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ముఖ్యంగా రెవెన్యూ వివాదాలు, భూ సమస్యలు, తాగునీటి ఎద్దడి, అంతర్గత రహదారులు, పబ్లిక్ టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, విద్యుత్ సరఫరా లోపాలు, ఇందిరమ్మ ఇండ్లు, శ్మశానవాటికల కొరత, మౌలిక సదుపాయాలు మరియు వృద్ధాప్య పెన్షన్ల వంటి అనేక అంశాలపై ప్రజలు మంత్రి దృష్టికి సమస్యలను తీసుకొచ్చారు.
మంత్రి కొండా సురేఖ ఫోన్ లైన్‌లోకి వచ్చిన ప్రతి ఒక్కరి బాధను ఎంతో ఓపికగా, సానుభూతితో విన్నారు. సమస్య తీవ్రతను బట్టి ఆమె కేవలం వినడం మాత్రమే కాకుండా తక్షణమే రంగంలోకి దిగారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్నలతో పాటు పలువురు ఉన్నతాధికారులతో మంత్రి అప్పటికప్పుడే ఫోన్‌లో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రాధాన్యత క్రమంలో (టాప్ ప్రయారిటీ) తీసుకుని, క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపి శరవేగంగా పరిష్కరించాలని ఆన్ ది స్పాట్ కఠిన ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ“రాష్ట్రంలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే ఒక సాధారణ ప్రజాప్రతినిధిగా ప్రజలు నన్ను గుర్తిస్తారని, అది నాకు ఎంతో గర్వకారణం” అని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని వంద శాతం నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. ఫోన్‌లో ప్రజలు చెప్పిన ప్రతి సమస్యను తన సొంత కుటుంబ సమస్యగా భావించి, దాని శాశ్వత పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిరుపేదకూ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.
కేవలం ఫోన్ ద్వారానే కాకుండా, వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనూ నిరంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తాను, తన భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఇద్దరూ కలిసి ప్రతిరోజూ ఉదయం నుంచే నియోజకవర్గ ప్రజల నుంచి నేరుగా వినతులు, దరఖాస్తులను (అప్లికేషన్లు) స్వీకరిస్తున్నామని చెప్పారు. స్థానికంగా వచ్చే సమస్యలపై సంబంధిత శాఖల అధికారులను అక్కడికక్కడే పిలిపించి మాట్లాడి, సాధ్యమైనంత తక్కువ సమయంలో సమస్యలు క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
తాను ఎక్కడ ఉన్నా తన ప్రాధాన్యత ఎప్పుడూ ప్రజలకే ఉంటుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. వరంగల్‌లోనే కాకుండా, హైదరాబాద్ సచివాలయం (సెక్రటేరియట్) లోని తన అధికారిక చాంబర్‌లో, జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలో, అలాగే బంజారాహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో నిరంతరం అవసరార్థులు, పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిరంతరం సమన్వయం (కోఆర్డినేషన్) చేసుకుంటూ ఆయా ఫైళ్లను వేగంగా క్లియర్ చేయిస్తున్నట్లు మంత్రి వివరించారు.
రాజకీయాల్లో పదవులనేవి శాశ్వతం కాదనే నిజాన్ని మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా గుర్తు చేశారు. “నాకు పదవులతో అసలు సంబంధం లేదు. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ, వారి కష్టాలు తీర్చడంలోనే నేను నిజమైన ఆనందాన్ని, తృప్తిని వెతుక్కుంటున్నాను. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు పరిష్కారమై, వారు సంతోషంగా వెళ్లేటప్పుడు వారి ముఖాల్లో కనిపించే చిరునవ్వే నాకు లభించే అసలైన అవార్డు” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయడం తన ప్రాథమిక బాధ్యత అని, వారి నమ్మకాన్ని కాపాడటమే తన కర్తవ్యమని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, సామాన్యుడి కష్టాలను తీర్చడమే ఈ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. గత పాలకుల లాగా కాకుండా, ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన, అత్యంత పారదర్శకమైన, ప్రజా కేంద్రిత పాలనను అందించడమే తమ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను మరిన్నింటిని చేపట్టి, ప్రతి పౌరుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని మంత్రి సురేఖ ధీమా వ్యక్తం చేశారు.