- సాగు, తాగునీరు, విద్యుత్ రంగాలపై సమీక్ష
- వేటిపైనా ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
- వాతావరణ మార్పులపై ముందస్తు చర్యలు
- రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ అవగాహన సదస్సు
- కార్యక్రమానికి హాజరైన మంత్రి అజారుద్దీన్
- గ్రామీణ స్థాయి వరకు చైతన్య కార్యక్రమాలు
హైదరాబాద్ వెలుతురు జూలై 21:
ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న ‘ఎల్ నినో’ వంటి ప్రతికూల మార్పుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు, వివిధ రంగాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ముందస్తు వ్యూహాలు రూపొందిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల నుంచి తెలంగాణ సంసిద్ధత వరకు” అనే అంశంపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సుకు రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కేవలం పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, ఎల్ నినో ప్రభావంపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడమే ప్రభుత్వ లక్షమని, సమస్య తీవ్రతను ముందే గ్రహిస్తే ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం సొంతంగా సరైన ప్రణాళికలు వేసుకోగలుగుతుంది.” అని అన్నారు.
వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తెలంగాణలోని చెరువులు, వాగులు, గ్రామీణ ప్రాంతాల నీటి వనరులపై ఎలాంటి ప్రభావం పడుతుందో శాస్త్రవేత్తల ద్వారా ప్రభుత్వం అధ్యయనం చేయిస్తోంది. దీని ఆధారంగా వ్యక్తిగత, కుటుంబ, గ్రామ, మండల మరియు జిల్లా స్థాయిలో ఎవరికి వారు ముందస్తుగా సిద్ధమయ్యేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు. సమస్యను ఎదుర్కోవడానికి ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ చైతన్యం తెస్తున్నట్లు తెలిపారు. కేవలం పాలనాపరమైన ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా, ఎల్ నినో ప్రభావంపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో అవగాహన పెంచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు.
ఒకవేళ వాతావరణ మార్పుల వల్ల వర్షాభావ పరిస్థితులు ఎదురైనా రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ నిపుణుల సూచనల ప్రకారం తక్కువ నీటితో, తక్కువ కాలంలో పండే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఈ సమాచారాన్ని నిరంతరం ప్రత్యక్ష ప్రసారాలు, మీడియా ద్వారా ప్రచారం చేస్తూ రైతాంగాన్ని సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో జీవన విధానానికి విద్యుత్ అత్యంత కీలకంగా మారిందని, ఎల్ నినో వల్ల పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను సమర్థవంతంగా తట్టుకునేందుకు ‘స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్’ అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. పగటి పూట సమృద్ధిగా, తక్కువ ఖర్చుతో లభించే సౌర విద్యుత్‌ను (సోలార్ పవర్) గరిష్టంగా వాడుకోవడం వల్ల ప్రభుత్వం మరియు వినియోగదారులపై పడే ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. పగటి పూట సోలార్ వాడి, మిగిలిన సమయాల్లో థర్మల్ విద్యుత్‌ను సమతుల్యంగా వాడుతూ విద్యుత్ గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడుతున్నట్లు చెప్పారు.
వాతావరణంలో మార్పులు మరియు ఉష్ణోగ్రతలు పెరగడంతో పగలు, రాత్రి తేడా లేకుండా ఫ్యాన్లు, ఏసీలు, బోర్లకు ఉపయోగించే మోటార్లు మరియు లిఫ్ట్ ఇరిగేషన్ పంపింగ్ వాడకం గణనీయంగా పెరిగిందని ప్రభుత్వం గుర్తించింది. సాధారణంగా వర్షాకాలంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంటుంది. కానీ, ఎల్ నినో ప్రభావంతో ప్రస్తుతం తెలంగాణలో నమోదవుతున్న డిమాండ్ వేసవి కాలం (ఏప్రిల్) నాటి గరిష్ట స్థాయికి చేరింది. ఈ రకమైన ఊహించని డిమాండ్‌ను తట్టుకునేలా ముందస్తుగా సమర్థవంతమైన ఎనర్జీ ప్లానింగ్ పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.
ప్రభుత్వం కేవలం ప్రజల తాగునీరు, వ్యవసాయ సాగునీటి అవసరాలకే పరిమితం కాకుండా సమగ్ర ఆలోచనతో అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పశువులు, పక్షులతో పాటు అడవుల్లో ఉండే జంతువుల నీటి, ఆహార అవసరాలకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అన్ని జీవరాశుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ శాఖలను సమన్వయం చేస్తూ ప్రణాళికా బోర్డు ఈ వివరాలను సిద్ధం చేసింది.
సమాజంలో వాతావరణ మార్పులపై చైతన్యం తీసుకురావడానికి విషయ నిపుణులతో ఈ సమావేశాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసిన ప్లానింగ్ శాఖను డిప్యూటీ సీఎం అభినందించారు. వ్యవసాయ, విద్యుత్, సాగునీటి, భూగర్భ జల శాఖలను సమన్వయం చేసి పనిచేయడాన్ని కొనియాడారు. భవిష్యత్తులో ఇటువంటి అవగాహన సదస్సులను అన్ని జిల్లాల్లో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ఐఏఎస్ అధికారులు దివ్య దేవరాజన్, గోపి, జితేష్ వి. పాటిల్, ప్లానింగ్ డైరెక్టర్ రూఫొస్ దత్తం తదితరులు పాల్గొన్నారు.