- సోనమ్ వాంగ్‌చుక్‌కు హైకోర్టులో ఊరట
- మెదాంతా ఆస్పత్రికి తరలించేందుకు గ్రీన్ సిగ్నల్
- భార్య గీతాంజలి అప్పీల్‌పై సంచలన తీర్పు
- కేంద్రం అభ్యంతరం లేదనడంతో ఊరట
- సఫ్దర్‌జంగ్ నుంచి మెదాంతాకు తరలింపున
- ఎయిమ్స్ వైద్య బృందం, వ్యక్తిగత వైద్యుడితో చర్చలు
- నిరంతర పర్యవేక్షణ అవసరమన్న నిపుణులు
హైదరాబాద్ వెలుతురు జూలై 21:
వివిధ పోటీ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలకు వ్యతిరేకంగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు దిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ప్రస్తుతం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను గురుగ్రామ్‌లోని మెదాంతా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు న్యాయస్థానం మంగళవారం అనుమతి ఇచ్చింది. వాంగ్‌చుక్‌ను ఆయనకు నచ్చిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు నిరాకరిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో దిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం ఆయనను తక్షణమే మెదాంతా ఆస్పత్రికి తరలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
విచారణ సందర్భంగా సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో వాంగ్‌చుక్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్న ఎయిమ్స్ వైద్య బృందంతో పాటు, ఆయన వ్యక్తిగత వైద్యుడితో కూడా హైకోర్టు ధర్మాసనం వివరంగా మాట్లాడింది. వాంగ్‌చుక్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు నిరంతర వైద్య పర్యవేక్షణ అత్యంత అవసరమనే విషయంలో అందరి వైద్యుల అభిప్రాయం ఒక్కటిగానే ఉందని కోర్టు పేర్కొంది. ఈ వైద్య నివేదికలను పరిశీలించిన అనంతరం, ప్రభుత్వ ఆస్పత్రిలో తన ఆరోగ్య పరిస్థితి, వసతులపై వాంగ్‌చుక్ వ్యక్తం చేసిన సందేహాలను, ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతూ ధర్మాసనం మధ్యాహ్నం ఈ కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
వాంగ్‌చుక్ తరఫున కోర్టులో హాజరైన సీనియర్ న్యాయవాది అఖిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని వెల్లడించారు. నిరాహార దీక్షను కొనసాగిస్తున్నప్పటికీ ఆయన నోటి ద్వారా ద్రవపదార్థాలను (ఫ్రూట్ జ్యూస్‌లు, నీళ్లు) తీసుకుంటున్నారని తెలిపారు. అయితే, ఆస్పత్రిలో ఆయనపై నిరంతరం పోలీసు నిఘా ఉంచుతున్నారని, కనీసం మొబైల్ ఫోన్ ఉపయోగించేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదని వాంగ్‌చుక్ రాసిన లేఖను కోర్టు ముందుంచారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, మెదాంతా ఆస్పత్రికి తరలిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయా అని ప్రశ్నించగా, ఖచ్చితంగా పరిష్కారమవుతాయని అఖిల్ సిబల్ స్పష్టం చేశారు.
ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు. సోనమ్ వాంగ్‌చుక్‌ను సఫ్దర్‌జంగ్ నుంచి గురుగ్రామ్‌లోని మెదాంతా ఆస్పత్రికి తరలించడంపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని ధర్మాసనానికి తెలిపారు. మెదాంతా అనేది అత్యంత పేరొందిన, అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న ఆస్పత్రి అని, అక్కడ ఆయన చికిత్స పొందేందుకు ప్రభుత్వం ఎంతమాత్రం అడ్డుచెప్పదని వివరించారు. కేంద్రం ధోరణి సానుకూలంగా ఉండటంతో హైకోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
అదే సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు ముందు ఒక ముందస్తు షరతును ఉంచారు. మెదాంతాలో చేరుస్తున్నందున, అక్కడ చికిత్స అందిస్తున్న వైద్యుల సలహాకు విరుద్ధంగా ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కోరకూడదని స్పష్టం చేశారు. దీనికి హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. వాంగ్‌చుక్‌ను తక్షణమే మెదాంతా ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించింది. అలాగే ఇప్పటివరకు సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో ఆయనకు నిర్వహించిన అన్ని వైద్య పరీక్షల నివేదికలు, ఆరోగ్య రికార్డులను మెదాంతా ఆస్పత్రి వైద్య బృందానికి తక్షణమే అందజేయాలని ఆదేశించింది.
దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో పూర్తిస్థాయిలో స్వాగతించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో వాంగ్‌చుక్‌కు అందించిన చికిత్స కంటే ఆయనను ఒక రకమైన నిర్బంధంలో ఉంచినట్లే అనిపించిందని సంచలన ఆరోపణలు చేశారు. నిజానికి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమీ ప్రాణాపాయ స్థితిలో లేదని, జంతర్‌మంతర్ నిరసన శిబిరం వద్దే వైద్యులు ఆయనను పర్యవేక్షించే అవకాశం ఉన్నప్పటికీ బలవంతంగా ఆస్పత్రికి తరలించారని విమర్శించారు. ఏదేమైనా కోర్టు ఉత్తర్వుల ప్రతి కాపీ అందగానే ఆయనను మెదాంతాకు మారుస్తామని చెప్పారు.
మరోవైపు పరీక్షల అక్రమాలపై సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ (సీజేపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ‘సంసద్ చలో’ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలో చోటుచేసుకున్న హింస, విధ్వంస ఘటనలపై దిల్లీ పోలీసులు తీవ్రస్థాయిలో చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఈ ఘర్షణలకు సంబంధించి నాలుగు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, లభించిన ఆధారాలను బట్టి మరిన్ని కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విధ్వంసం వెనుక ఒక పక్కా వ్యూహం, ప్రణాళిక ఉన్నట్లు కీలక ఆధారాలు లభించాయని దిల్లీ పోలీసు అధికారులు వెల్లడించారు.
సోమవారం నాటి ముట్టడి సమయంలో చోటుచేసుకున్న రాళ్లదాడి, ఘర్షణల్లో సుమారు 118 మందికి పైగా పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని, 20కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. పార్లమెంట్ స్ట్రీట్, కన్నౌట్ ప్లేస్ స్టేషన్లలో భారతీయ న్యాయ సంహిత, ఆయుధ చట్టం, ప్రజా ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, డ్రోన్ విజువల్స్ ఆధారంగా రాళ్ల దాడికి పాల్పడిన అల్లరి మూకలను గుర్తిస్తున్నారు. అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరవేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటుండగా, జంతర్మంతర్ వద్ద తమ నిరసన శాంతియుతంగా కొనసాగుతుందని సీజేపీ ప్రకటించింది.