- కరువు వేళ రాజకీయాలు మానుకోవాలి… రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం
- దేవాదుల ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం
- దేవాదులపై అసెంబ్లీలో చర్చకు సిద్దం
- పదేళ్లు నిర్లక్ష్యం చేసిన వారికే ఇప్పుడు మాట్లాడే హక్కు లేదు
- వరంగల్ వేదికగా చర్చించిన అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం
- రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
వరంగల్ / హైదరాబాద్ వెలుతురు జూలై 21:
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంటే, పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
మంగళవారం వరంగల్ జిల్లా సమీక్ష సమావేశం అనంతరం సహచర మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు పదేళ్లపాటు అధికారంలో ఉన్న మీరు ఏం చేశారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. “నోరు తెరిస్తే అబద్ధాలే… అబద్ధాల పునాదుల మీదనే బీఆర్ఎస్ రాజకీయాలు కొనసాగుతున్నాయి” అని మండిపడ్డారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, కరువు పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. బట్ట కాల్చి ప్రభుత్వంపై వేయాలనే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఐదేళ్లు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీస అవగాహన లేకుండా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోందని, ఏపీకి నీళ్లు ఇవ్వడానికే ఇక్కడ ఎత్తిపోతల ఆపేశారని చెప్పడం పూర్తిగా వాస్తవ విరుద్ధమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దాదాపు రెండు గంటల పాటు సమగ్రంగా చర్చించామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ, అందుబాటులో ఉన్న తాగునీరు, సాగునీటిని సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలనే దానిపై కార్యాచరణ రూపొందించామని చెప్పారు. కరువు ప్రభావం రైతులపై వీలైనంత తక్కువగా పడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వరంగల్ వేదికగా 5 గంటలకు పైగా చర్చించిన అంశాలపై మరో సారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో క్యాబినెట్‌లో చర్చించి రాష్ట్ర మంతటా అమలు చేస్తామన్నారు. లెమన్ గ్రాస్, ఉపాధి హామీ పధకం ద్వారా కార్మికులకు ఉపాధి చర్యలు వంటి అంశాలపై చర్చిస్తామన్నారు. గోదావరి ద్వారా 16632 క్యూసెక్కుల నీరు పోతోందని , మీ హయాంలో మోటార్లు వేస్తే ఎందుకు నష్టం జరిగిందో చెప్పాలన్నారు.
ఇలాంటి సమయంలో ప్రధాన ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించి నిర్మాణాత్మక సూచనలు చేయాల్సింది పోయి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. హరీష్‌రావు చెప్పారని మోటార్లు ఆన్ చేయడం, సాగునీరు ఇవ్వడం చేశామన్న వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. తాము రైతులు, ప్రజలు, నిరుద్యోగుల కోసం నిరంతరం పనిచేస్తామని మంత్రి పొంగులేటి స్ఫష్టం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా జీవనాడి అయిన దేవాదుల ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మూడు దశల్లో ప్రారంభించారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు దేవాదుల ప్రాజెక్టును పూర్తిచేయాలనే ఆలోచన కూడా చేయకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదుల ప్రాజెక్టును పూర్తిచేయడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు.
ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి ప్రాజెక్టును సందర్శించి, మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్ట్ విషయంలో అసెంబ్లీలో పూర్తి స్ధాయి చర్చకు సిద్దంగా ఉన్నామని దీనికి మీరు సిద్దమేనా అని మంత్రి ప్రశ్నించారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, రాజకీయ ఆరోపణలకు కాకుండా సమస్యల పరిష్కారానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, మురళీ నాయక్, రాష్ట్ర ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులు, కేవీకే–ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.