నిరంకుశాన్ని ఎదురొడ్డి ప్రజల్లో చైతన్యం నింపిన ధీశాలి దాశరథి

హైదరాబాద్, జూన్ 22 (వెలుతురు):

తెలంగాణ రైతాంగ సాయధ పోరాటంలో అక్షరాన్ని ఆ యుధంగా మలిచి నిజాం నిరంకుశ పాలనపై ధిక్కార స్వరం వినిపించిన మహానీయుడు ఉద్యమ వైతాళికుడు, మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు అని తెలంగాణ సాంస్కృతిక మండలి చైర్‌పర్సన్‌ వెన్నెల గద్దర్ కొనియాడారు. దాశరథి 101వ జయంతిని భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కవి, రచయిత, పాలపిట్ట సాహిత్య మాస పత్రిక నిర్వాహకుడు, సీనియర్‌ జర్నలిస్టు గుడిపాటి వెంకటేశ్వర్లుకు డాక్టర్ దాశరథి సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆయనకు అవార్డుతోపాటు రూ.1,00,116 చెక్కు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా వెన్నెల గద్దర్ మాట్లాడుతూ దాశరథి అభ్యుదయ భావాలతో అనేక రచనలు చేసి ప్రజలను చైతన్యం చేశారని, తన రచనలతో తెలంగాణ జాతిని జాగృతం చేశారని కొనియాడారు. స్వరాజ్యం, స్వేచ్ఛ కోసం నిరంతరం తపించిన దాశరథి స్ఫూర్తితో కవులు, కళాకారులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్యాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టిన దాశరథి కవిత్వం, సాహిత్యం భవిష్యత్తు తరాలకు నిత్య స్ఫూర్తిదాయకమని పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సెక్రటరీగా ఎ. వాణీ ప్రసాద్‌ అన్నారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దాశరథి రచించిన పద్యాలు, పాటలు ఇప్పటికీ ప్రజలందరికీ ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగిస్తాయని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నర్సింహా రెడ్డి అన్నారు. తన ప్రాంత ప్రజల కష్టాలను, ప్రపంచానికి వినిపించిన తెలంగాణ గర్వించదగ్గ భూమి పుత్రుడు దాశరథి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పురస్కార ఎంపిక కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రచయిత డా. అమ్మంగి వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌, దాశరథి కుమారుడు లక్ష్మణ్, కుమార్తె ఇందిరా, ఏవో డా. పి. విజయ్ కుమార్, సాంస్కృతిక సలహా మండలి సభ్యులు ముచర్ల దినకర్ తదితరులు పాల్గొన్నారు.

Dasarthi Award 2026Enugu Narasimha ReddyRavindra Bharathi
Comments (0)
Add Comment