ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

హైదరాబాద్, వెలుతురు. ఆగష్టు 21:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దైంది. ప్రస్తుతం లండన్ లో పర్యటనలో ఉన్న సీఎం యూకే నుంచి అమెరికా వెళ్లాల్సి ఉండగా వెళ్లకుండానే పర్యటనను రద్దు చేసుకుని తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. ఈనెల 19 నుంచి 30 వరకు పదిరోజుల పాటు విదేశాల్లో సీఎం పర్యటించాల్సి ఉంది. విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్‌తో పాటు అమెరికాలో ఉన్న ప్రముఖ యూనివర్సిటీలను సందర్శించి విద్యా విధానం, స్కిల్ డెవలప్‌మెంట్‌ విషయంలో ఆయా దేశాలు ఎలాంటి విధానాలను అవలంభిస్తున్నాయనే దానిపై ముఖ్యమంత్రి అధ్యయనం చేయాల్సి ఉంది.

ప్రస్తుతం లండన్‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, లండన్ బిజినెస్ స్కూల్‌ను సందర్శించాల్సి ఉంది. 23 వరకు లండన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి అక్కడి నుంచి అమెరికాలో పర్యటించి తిరిగి 30న హైదరాబాద్‌కు తిరిగి రావాల్సి ఉంది. అయితే విదేశీ పర్యటనలకు వెళ్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం సీఎంవో అధికారులు దరఖాస్తు చేశారు. యూకే పర్యటనకు అనుమతి లభించినప్పటికీ, అమెరికా పర్యటనకు అనుమతి లభించకపోవడంతోనే సీఎం రేవంత్ పర్యటనను రద్దు చేసుకున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అవసరమైన ప్రొటోకాల్ అనుమతులు లభించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిసింది.

ఈ నెల 23వ తేదీన రేవంత్ రెడ్డి లండన్ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంతో ఆయన తిరిగి లండన్ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు.

Revanth Reddy
Comments (0)
Add Comment