మైనారిటీ మహిళల స్వయం ఉపాధికి ప్రభుత్వం అండ: అజహరుద్దీన్

  • 278 మంది వితంతు మహిళలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం
  • 13 మంది తుర్క కాశా ముస్లిం కమ్యూనిటీ సభ్యులకు జనరేటర్లు, టూల్ కిట్ల పంపిణీ

రంగారెడ్డి, సెప్టెంబర్ 2:
మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో బుధవారం తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) చైర్మన్మొ హమ్మద్ ఒబేదుల్లా కోత్వాల్ తో కలిసి మంత్రి మైనారిటీ లబ్ధిదారులకు ఆర్థిక సాయం, జీవనోపాధి ప్రోత్సాహకాలను పంపిణీ చేశారు.

ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద 278 మంది మైనారిటీ వితంతు మహిళలకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సాయం మహిళలు తమ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవడంతో పాటు స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపట్టేందుకు దోహదపడుతుందని మంత్రి తెలిపారు.

అదేవిధంగా ‘మైనారిటీ కమ్యూనిటీకి తుర్క కాశా పునరావాసం’ పథకం కింద 13 మంది తుర్క కాశా ముస్లిం కమ్యూనిటీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.60 వేల విలువైన జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు. వీటి ద్వారా లబ్ధిదారులు స్వయం ఉపాధి పొందడంతో పాటు తమ జీవనోపాధిని మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

ఈ సందర్భంగా మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ, విస్తృతమైన, వైవిధ్యభరితమైన పారిశ్రామిక ప్రాంతాలు ఉండటంతో రంగారెడ్డి జిల్లా దేశంలోని ప్రముఖ ఆర్థిక జిల్లాల్లో ఒకటిగా ఎదిగిందన్నారు. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి వేగంగా జరుగుతున్నందున ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో అందుబాటులో ఉన్న ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలు తమ పనిలో ఎంతో సమర్థులని, వారికి బలమైన వృత్తిపరమైన విలువలు ఉన్నాయని అన్నారు. మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితిగతులతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న కుట్టు మిషన్లు, జనరేటర్లు, టూల్ కిట్లు, ఇతర సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని మైనారిటీ మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని మంత్రి సూచించారు.

మైనారిటీల సంక్షేమంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మైనారిటీ మహిళల ఆర్థిక అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంత్రి తెలిపారు. మైనారిటీల సంక్షేమంపై ముఖ్యమంత్రికి ఎంతో చిత్తశుద్ధి ఉందన్నారు. మదీనా బస్సు అగ్నిప్రమాద ఘటన అనంతరం బాధిత కుటుంబాలకు పరిహారం అందించేందుకు ముఖ్యమంత్రి తక్షణమే నిర్ణయం తీసుకోవడం మైనారిటీల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. అలాగే హజ్ ఏర్పాట్ల కోసం ముఖ్యమంత్రి రూ.7 కోట్లు మంజూరు చేయడం మైనారిటీ కమ్యూనిటీ అవసరాలు, సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు నిదర్శనమని పేర్కొన్నారు.

కుట్టు మిషన్లతో ప్రత్యేక అనుబంధం

కుట్టు మిషన్లతో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తాను చిన్నతనంలో ఉన్నప్పుడు తన తల్లి తనకు దుస్తులు కుట్టి ఇచ్చేవారని తెలిపారు. అప్పట్లో కుట్టు మిషన్లు ఉపయోగించడం అంత సులభంగా ఉండేది కాదని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మిషన్లు ఆధునిక సదుపాయాలతో సులభంగా పనిచేస్తున్నాయని చెప్పారు.

తన క్రికెట్ కెరీర్‌ను ప్రస్తావిస్తూ మంత్రి సరదాగా స్పందించారు. “నేను టెస్ట్ ప్లేయర్‌ను. నిధుల కోసం నాయకులు కోరిన డిమాండ్ల విషయంలో కూడా నేను సెంచరీ కొడతానని హామీ ఇస్తున్నాను” అని అన్నారు.

చేపలు ఇవ్వడం కాదు.. చేపలు పట్టడం నేర్పించాలి

మహిళలు, యువత స్వయం ఆధారితంగా ఎదిగేలా వారికి అవసరమైన నైపుణ్యాలు, అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. “చేపలు పట్టడం నేర్పించాలి. అలా చేస్తే వారు తమకు తాము ఆహారం సమకూర్చుకోవడంతో పాటు ఇతరులకు కూడా అండగా నిలవగలరు”అని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, యువతకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తన క్రికెట్ కెరీర్‌లోనూ, మంత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడంలోనూ ప్రజల మద్దతు ఎంతో కీలకమైందన్నారు. “నేను పదవిలో ఉన్నంతకాలం మీ కోసం పనిచేస్తాను” అని ప్రజలకు హామీ ఇచ్చారు.

యువతకు సరైన మార్గనిర్దేశం అవసరం

ముఖ్యంగా పాతబస్తీ యువతకు కమ్యూనిటీ నాయకులు, పెద్దలు సరైన మార్గనిర్దేశం చేయాలని మంత్రి కోరారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఇతర ఉత్పాదక కార్యక్రమాల ద్వారా యువత తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.

TGMFC చైర్మన్ మొహమ్మద్ ఒబేదుల్లా కోత్వాల్ మాట్లాడుతూ, మైనారిటీ కమ్యూనిటీ సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు అందిస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి మహ్మద్ అజహరుద్దీన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, చీఫ్ విప్ & ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్మయి, రంగారెడ్డి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, TGMFC అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mohammad Azharuddin
Comments (0)
Add Comment