విదేశాల్లో భారతీయ న్యాయవాదులకు విస్తృత అవకాశాలు: పూజారి నాగేశ్వరరావు

హైదరాబాద్, వెలుతురు, సెప్టెంబర్ 03:

భారతీయ న్యాయవాదులకు విదేశాల్లో న్యాయవృత్తిని కొనసాగించేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని ప్రముఖ న్యాయవాది పూజారి నాగేశ్వరరావు అన్నారు. న్యాయవాదులు తమ న్యాయ పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సూచించారు.

రంగారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతీయ న్యాయవాదులకు యూకే, యూఎస్, దుబాయ్‌లలో న్యాయవృత్తి అవకాశాలు – ప్రాక్టీస్ విధానం” అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పూజారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి దేశంలో న్యాయవృత్తికి ప్రత్యేక అర్హతలు, లైసెన్సింగ్ విధానాలు, బార్ పరీక్షలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు ఉంటాయని వివరించారు. ఆయా దేశాల న్యాయవ్యవస్థ, ప్రాక్టీస్ విధానంపై సమగ్ర అవగాహన పెంచుకుని, అవసరమైన అర్హతలు సాధించడం ద్వారా భారతీయ న్యాయవాదులు విదేశాల్లో తమ కెరీర్‌ను నిర్మించుకోవచ్చని తెలిపారు.

యూకే, యూఎస్, దుబాయ్‌లలో కార్పొరేట్ లా, కమర్షియల్ లా, ఇంటర్నేషనల్ లా, ఆర్బిట్రేషన్, ఇమ్మిగ్రేషన్, లీగల్ కన్సల్టెన్సీ, కంప్లయెన్స్, లీగల్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ వంటి విభాగాల్లో ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. భారతదేశంలో కోర్టు ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు తమ అనుభవాన్ని అంతర్జాతీయ న్యాయరంగంతో అనుసంధానం చేసుకునే మార్గాలపై కూడా అవగాహన కల్పించారు.

ప్రపంచీకరణ నేపథ్యంలో న్యాయవాదుల వృత్తి పరిధి కేవలం స్థానిక కోర్టులకే పరిమితం కాకూడదని నాగేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ న్యాయ పరిజ్ఞానంతో పాటు సాంకేతిక నైపుణ్యం, భాషా ప్రావీణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు. యువ న్యాయవాదులు విదేశాల్లో న్యాయవృత్తికి సంబంధించిన అవకాశాలు, అర్హతలు, ప్రాక్టీస్ విధానాలపై ముందుగానే అవగాహన పెంచుకుని తమ కెరీర్‌కు సరైన దిశను ఎంచుకోవాలని సూచించారు. ఈ సదస్సు ద్వారా న్యాయవాదులకు అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న అవకాశాలపై స్పష్టమైన అవగాహన కలిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విప్లవ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వోద్యారపు రవికుమార్, సహాయ కార్యదర్శి మల్లేశం, కోశాధికారి మాధవి, లైబ్రరీ కార్యదర్శి ప్రసాద్, క్రీడా సాంస్కృతిక కార్యదర్శి భీంరావు, సుధా, కార్యవర్గ సభ్యులు నరేష్, సత్యనారాయణ, విజయ్ తదితరులతో పాటు సీనియర్ న్యాయవాదులు, పలువురు యువ న్యాయవాదులు పాల్గొన్నారు.

Pujari Nageshwar Rao
Comments (0)
Add Comment