- ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియామకం
- మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద నియామకం
హైదరాబాద్, వెలుతురు,సెప్టెంబర్ 03:
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నారెడ్డి స్థానంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణిని నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
చిన్నారెడ్డిని ఎందుకు తొలగించారు?
కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆగస్టు 16వ సొంత పార్టీకే చెందిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వనపర్తి ఎమ్మెల్యే టికెట్ తనకు ఇవ్వాలని రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెప్పారని చిన్నారెడ్డి అన్నారు. ఆయన వద్ద డబ్బు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకోవాలని ఆదేశించారని పేర్కొన్నారు. అయితే, పార్టీలోని ఎన్నికల కమిటీ డబ్బులకు ఆశపడి తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను అవినీతి పార్టీగా మేఘారెడ్డి మార్చారని మండిపడ్డారు.
చిన్నారెడ్డి ప్రతిపక్షాలతో కలిసి పార్టీని నష్టపరిచే విధంగా వ్యవహరిస్తూ పార్టీతో పాటు తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని మేఘారెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలకు ఫిర్యాదు చేయడంతో ఆయనను పదవి నుండి తప్పించారు.