రూ.32 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభం – విద్య, వైద్యం, విద్యుత్, రహదారుల రంగాల్లో పలు పనులకు శంకుస్థాపనలు
నకిరేకల్, వెలుతురు, సెప్టెంబర్ 5:
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, బీర్ల ఐలయ్యతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
నకిరేకల్‌లో రూ.32 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని సీఎం ప్రారంభించారు. అలాగే నియోజకవర్గంలో రూ.9.85 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీజీపీఎస్) భవనానికి శంకుస్థాపన చేశారు.
నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’కు శంకుస్థాపన చేశారు. మునిపంపుల గ్రామంలో రూ.3.62 కోట్లతో చేపట్టనున్న 1×5 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్ (PTR), 33/11 కేవీ సబ్‌స్టేషన్, 33 KV, 11 కేవీ విద్యుత్ లైన్లు, కంట్రోల్ రూమ్ నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన జరిగింది.
కేతేపల్లి మండలం గుడివాడలో రూ.2.74 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్, 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. నకిరేకల్ మండలంలో రూ.20 కోట్లతో నిర్మించనున్న సమీకృత మండల స్థాయి కార్యాలయాల సముదాయానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.45.60 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు రహదారి అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. నకిరేకల్–గురజాల రోడ్డు నుంచి బైరౌనిబండ వరకు, బైరౌనిబండ నుంచి అమ్మనబోలు–రామాంజాపూర్ రోడ్డు వరకు రహదారి నిర్మాణం, అలాగే అమ్మనబోలు–రామాంజాపూర్ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు ఇందులో ఉన్నాయి. నకిరేకల్‌లో రూ.1.10 కోట్లతో నిర్మించనున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ భవనానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
కాంగ్రెస్‌కు నల్గొండ కంచుకోట: సీఎం
అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని ప్రజలు మరోసారి నిరూపించారని అన్నారు. నకిరేకల్‌లో భారీగా తరలివచ్చిన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పార్టీకి తమ మద్దతును చాటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గత ప్రభుత్వ పదేళ్ల పాలనతో బేరీజు వేసుకోవాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేయకుండా మరింత విస్తరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.
రైతులకు పెద్దపీట
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రేవంత్‌రెడ్డి అన్నారు. 25.35 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, 32 నెలల్లో రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు అందించామని తెలిపారు. వరి రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందని, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చామని చెప్పారు. ఉచిత విద్యుత్ కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేశామని, రైతు కుటుంబాలకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.
మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం
మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని సీఎం తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
హైటెక్ సిటీ సమీపంలో మహిళా సంఘాలు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పాఠశాల విద్యార్థుల యూనిఫాంల కుట్టు, అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ వంటి అవకాశాలను మహిళా సంఘాలకు కల్పిస్తున్నామని చెప్పారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు
తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ యువత కీలక పాత్ర పోషించిందని రేవంత్‌రెడ్డి అన్నారు. గత పాలనలో ప్రశ్నపత్రాల లీకేజీలతో నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 72 వేల ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు.
రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యమకారుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నూతన రేషన్ కార్డుల ద్వారా 3.48 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని, 50 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు తిరస్కరిస్తారని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అన్నారు. ఈ నెలాఖరులో సిరిసిల్లకు వస్తానని, కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో పది సంవత్సరాలు కొనసాగుతుందని, 2024 నుంచి 2034 వరకు రెండుసార్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని సీఎం అన్నారు. ప్రతిపక్ష నేతలు విమర్శలకు పరిమితం కాకుండా అసెంబ్లీకి వచ్చి చర్చకు సిద్ధం కావాలని సవాల్ చేశారు.