మిస్టర్ డీజీపీ నన్ను అసభ్యంగా కామెంట్ చేసిన కానిస్టేబుల్‌ను అరెస్ట్ చెయ్యి
పరీక్ష పాస్ అయి డీజీపీ అయినవా.. రికమండేషన్ లో జాబ్ లోకి వచ్చినవా ?
డీజీపీ తీరుపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ ఆగ్రహం
ఉద్యమకారులకు నిర్ణీత కాలవ్యవధితో హామీ ఇవ్వాలి
బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఆందోళన చేసే హక్కు లేదు
హైదరాబాద్, వెలుతురు, సెప్టెంబర్ 6:
తనపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్‌పై కేవలం సస్పెన్షన్‌తో సరిపెట్టకుండా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే నిబంధనలు ఉన్నప్పటికీ పోలీసు శాఖ వ్యవహరిస్తున్న తీరు బాధ్యతారాహిత్యంగా ఉందని ఆమె విమర్శించారు.
బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పోలీసు సిబ్బందిపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోకపోతే ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తానని ఆమె హెచ్చరించారు.
డీజీపీ తీరుపై కవిత తీవ్ర విమర్శలు
తనను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన కానిస్టేబుల్‌ను కేవలం సస్పెండ్ చేయడం ఏమిటని కవిత ప్రశ్నించారు. మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉందన్నారు. భారత న్యాయ సంహిత, ఐటీ చట్టాల్లోని సంబంధిత నిబంధనలను డీజీపీ పరిశీలించాలని సూచించారు.
20 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న తనకే రక్షణ లేకపోతే సాధారణ మహిళలకు పోలీసు శాఖ ఎలాంటి భద్రత కల్పిస్తుందని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో డీజీపీ మరింత సున్నితత్వంతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో నేరాలు, గంజాయి అక్రమ రవాణా పెరుగుతున్నాయని కవిత ఆరోపించారు. గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టాల్సిన బాధ్యత పోలీసు శాఖదేనని అన్నారు. హేట్ స్పీచ్‌ను అరికట్టేందుకు ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రతిపాదిత బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారులకు కాలపరిమితితో హామీ ఇవ్వాలి
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులను ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని కవిత ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని విమర్శించారు.
అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమకారులు తమ హక్కుల కోసం మళ్లీ ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని అన్నారు.
ఉద్యమకారుల సమస్యలపై తాము భూపోరాటం నిర్వహించిన సమయంలో వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారని కవిత గుర్తుచేశారు. ఉద్యమకారుల కోసం తెలంగాణ జన సమితి గతంలో సేకరించిన వివరాలను కూడా ప్రభుత్వం వినియోగించుకోవాలని సూచించారు.
కేకే కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్న ఉద్యమకారుల వివరాల ఆధారంగా వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఉద్యమకారులకు నిర్ణీత కాలవ్యవధితో కూడిన స్పష్టమైన హామీ ముఖ్యమంత్రి ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో కాంగ్రెస్ నేతలను రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఆందోళన హక్కు లేదు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, ఆచరణలో వారి జనాభాను తక్కువగా చూపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కవిత ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ, దాని ఆమోదం కోసం కేంద్రంపై అవసరమైన స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్రం నిర్వహించే కులగణనలో ప్రతి కులానికి సంబంధించిన ప్రత్యేక కాలమ్ ఉండాలని కోరారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేంద్రంపై వంద రోజుల కార్యాచరణ పేరుతో ఆందోళనలు చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని కవిత విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ జరగకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ నాటకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆమె ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని కవిత డిమాండ్ చేశారు.