ఢిల్లీలో నిర్బంధ చర్యలను ఖండించిన మంత్రి పొన్నం

ఢిల్లీలో నిర్బంధ చర్యలను ఖండించిన మంత్రి పొన్నం

హైదరాబాద్: ఢిల్లీలో నిరసనలకు దిగుతున్న వారిపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నిర్బంధ చర్యలను తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని పేర్కొన్నారు. నిరసనలను అడ్డుకునేందుకు రవాణా సౌకర్యాలను నిలిపివేయడం, మెట్రో, రైలు సేవలకు అంతరాయం కల్పించడం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం, భారీగా పోలీసులను మోహరించడం, నిరసనకారులను అరెస్టు చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

 

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైనదని పొన్నం పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అర్హులైన పౌరులు తమ ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటర్ల హక్కుల పరిరక్షణపై వస్తున్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

 

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో పాటు, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా పారదర్శక చర్యలు చేపట్టాలని పొన్నం అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ‘ఓటు దొంగతనం’ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.

ప్రజల ఆందోళనలను అణచివేయడం కాకుండా, వారి డిమాండ్లపై చర్చించి పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఢిల్లీలో నిరసనకారులపై నిర్బంధ చర్యలను తక్షణమే నిలిపివేసి, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు పరిరక్షణ కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

delhi lPonnam
Comments (0)
Add Comment