పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచాలి : హరీశ్‌రావు

పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచాలి : హరీశ్‌రావు

 

సిద్దిపేట, వెలుతురు, అక్టోబర్ 19 :  పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా పారిశుధ్య కార్మికుల జీతాలను ప్రభుత్వం తక్షణమే పెంచాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. సిద్దిపేట మున్సిపల్‌ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్న ఆయన.. వారితో ఆత్మీయంగా ముచ్చటించి, టిఫిన్‌ చేశారు. అనంతరం తన సొంత ఖర్చులతో మహిళా కార్మికులకు చీరలు, పురుష కార్మికులకు దుస్తులు అందజేశారు.

 

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేటకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు రావడం తన గొప్పతనం కాదని, చలి, వానను లెక్కచేయకుండా పనిచేసిన పారిశుధ్య కార్మికుల రెక్కల కష్టమే కారణమన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల జీతాలను రూ.8,300 నుంచి రూ.16,600కు పెంచామని, కాంట్రాక్టర్లు, మధ్యవర్తులను తొలగించి నేరుగా కార్మికుల ఖాతాల్లో జీతాలు జమయ్యేలా గ్రూప్‌ విధానం తీసుకొచ్చామని తెలిపారు.

 

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా కార్మికుల జీతాలను ఒక్క రూపాయి కూడా పెంచలేదని విమర్శించారు. మరోవైపు నిత్యావసరాలు, ఇళ్ల అద్దెలు, బస్సు ఛార్జీలు భారీగా పెరిగాయని అన్నారు. సిద్దిపేటలో భూగర్భ డ్రైనేజీ, స్వీపింగ్‌ మిషన్లు, చెత్త సేకరణ ఆటోలు, పందుల నియంత్రణ వంటి చర్యలతో కార్మికుల శ్రమను గతంలో తగ్గించామని పేర్కొన్నారు.

 

పారిశుధ్య కార్మికులతో పాటు నల్లా ఆపరేటర్లు, మొక్కలు నాటే కార్మికులకు కూడా గ్రూప్‌ విధానం అమలు చేసి నేరుగా జీతాలు చెల్లించాలని కోరారు. ఈ అంశాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి కార్మికుల పక్షాన పోరాడతానని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

brsHarish RaoSiddipet
Comments (0)
Add Comment