చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమావేశం
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 19 :
రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమితి ఆధ్వర్యంలో, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఏఐసీసీ నాయకులు గిడుగు రుద్రరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర కాంగ్రెస్ నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనుడని కొనియాడారు. చార్మినార్‌తో రాజీవ్ గాంధీకి విడదీయలేని అనుబంధం ఉందని పేర్కొన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదే అని, నేడు దేశ ప్రజలు మొబైల్ ఫోన్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవడంలో ఆయన దూరదృష్టి కీలక పాత్ర పోషించిందని అన్నారు. ప్రజలకు వైద్య సేవలందిస్తూ వారి మనసులను గెలుచుకున్న మల్లికార్జున గారిని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
కాంగ్రెస్ పార్టీ చరిత్ర త్యాగాలతో ముడిపడి ఉందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. దేశం కోసం తన ప్రతి రక్తపు బొట్టును ధారపోస్తానని చెప్పిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన సోనియా గాంధీ వంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఆదర్శమని అన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామ్యం లేని బీజేపీ నేడు దేశభక్తి గురించి పాఠాలు చెబుతోందని విమర్శించారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి మహనీయుల చరిత్రను ప్రజల మదిలో నుంచి చెరిపివేసేందుకు, చరిత్రను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్రను యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
దేశం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోంది
దేశంలో శాశ్వతంగా అధికారంలో కొనసాగాలనే లక్ష్యంతో కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మతం, కులం పేరుతో ఓటర్ల జాబితాల నుంచి ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. దేశం కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ఒక్క చుక్క రక్తమైనా ధారపోశారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాలకు ప్రతీక అని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్ఫూర్తిని స్మరించుకుంటూ, దేశంలో మతసామరస్యం, సామాజిక ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.