- రెండు వేల మందికి పైగా ప్రవాస తెలంగాణ కుటుంబాల హాజరు
- ప్రత్యేక అతిథిగా టీజీఎఫ్డీసీ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం
లండన్, వెలుతురు, అక్టోబర్ 19 :
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో నిర్వహించిన ‘చేనేత బతుకమ్మ–దసరా’ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. యూకే నలుమూలల నుంచి రెండు వేల మందికి పైగా ప్రవాస తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై చాటిచెబుతూ, చేనేతకు చేయూతనిచ్చే లక్ష్యంతో ఈ వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బ్రిటన్ పార్లమెంట్ సభ్యురాలు రూత్ క్యాడ్బరీ, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌన్స్లో మేయర్ రణ్జిత్ గిల్, హౌన్స్లో కౌన్సిల్ నాయకుడు శాంతను రాజావత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్డీసీ) మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. యూకే తెలుగు బిజినెస్ ఛాంబర్ నాయకుడు సిక్కా చంద్రశేఖర్ గౌడ్‌తో పాటు పలువురు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
చేనేతకు చేయూతనివ్వడమే లక్ష్యం
టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ నాయకత్వంలో చేనేత రంగానికి అండగా పలు కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అదే స్ఫూర్తితో, మాజీ మంత్రి కేటీఆర్ కృషిని కొనసాగిస్తూ చేనేత కార్మికులకు చేయూతనివ్వాలనే సామాజిక బాధ్యతతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న బతుకమ్మ, దసరా వేడుకలను ఈసారి ‘చేనేత బతుకమ్మ–దసరా’గా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటుతున్న ప్రవాసులు
ముఖ్య అతిథులు మాట్లాడుతూ, యూకేలో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులు సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటూ, విదేశాల్లోనూ తమ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం అభినందనీయమని అన్నారు. టాక్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. లండన్ బహుళ సంస్కృతులకు నిలయమని, పరస్పర సంప్రదాయాలను గౌరవించుకుంటూ ఐకమత్యంతో ముందుకు సాగాలని సూచించారు. స్థానికంగా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తెలంగాణ ఆడబిడ్డలకు అనిల్ కూర్మాచలం బతుకమ్మ శుభాకాంక్షలు
టీజీఎఫ్డీసీ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ముందుగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. లండన్ గడ్డపై తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసి, రాజకీయాలకు అతీతంగా సామాజిక వేదికపై నిరంతరం సేవలందిస్తున్న టాక్ కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. వేడుకలకు హాజరై విజయవంతం చేసిన ప్రవాస కుటుంబ సభ్యులకు, అతిథులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
టాక్ ఉపాధ్యక్షురాలు శుష్మున రెడ్డి మాట్లాడుతూ, సంస్థ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రవాస తెలంగాణ సమాజం విజయవంతం చేస్తూ టాక్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తోందన్నారు. ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ, తమ పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో ప్రవాసులు చేనేత వస్త్రాలు ధరించి వేడుకలకు హాజరుకావడం ఎంతో సంతోషాన్ని, స్ఫూర్తిని ఇచ్చిందన్నారు.
సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పూజలు.. ఘనంగా అలాయ్–బలాయ్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో మహిళలు రంగురంగుల బతుకమ్మలను తీసుకొచ్చి గౌరీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ, చప్పట్లు కొడుతూ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విదేశాల్లో స్థిరపడినప్పటికీ తెలంగాణ ఆడపడుచులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడటం, చిన్నారులు సైతం చిన్న చిన్న బతుకమ్మలతో వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
టాక్ కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ గణేష్ కుప్పాల మాట్లాడుతూ, దసరా సందర్భంగా స్వదేశం నుంచి తీసుకొచ్చిన శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అలాయ్–బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చేనేత శాలువాలను పరస్పరం కప్పుకొని, జమ్మి ఆకులను బంగారంగా భావించి ఇచ్చిపుచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చేనేత వస్త్రాలను వీలైనన్ని సందర్భాల్లో ధరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. లండన్‌లో తెలంగాణ సంప్రదాయమైన అలాయ్–బలాయ్ ఆత్మీయతను చాటిచెప్పిన ఈ కార్యక్రమాన్ని పలువురు ప్రశంసించారు.
చేనేతకు చేయూతనివ్వడం సామాజిక బాధ్యత
టాక్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర సంస్కృతి, పండుగలకు విస్తృత గుర్తింపు లభించిందన్నారు. చేనేతకు మద్దతుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో సామాజిక బాధ్యత దాగి ఉందని పేర్కొన్నారు. టాక్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, ఈవెంట్స్ ఇన్చార్జి మల్లా రెడ్డి మాట్లాడుతూ, ప్రతి కార్యక్రమానికి సామాజిక బాధ్యతను జోడిస్తూ ముందుకు సాగుతున్నామని, సంస్థకు అండగా నిలుస్తున్న ప్రవాసులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
టాక్ ఉపాధ్యక్షులు సురేష్ బుడగం, రాకేష్ పటేల్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు సంస్థ ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తామని తెలిపారు. చేనేత వస్త్రాలు, బతుకమ్మలకు సంబంధించిన బహుమతులను స్పాన్సర్ చేసిన నాగరాజు తౌటంను టాక్ ప్రతినిధులు ప్రత్యేకంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. టాక్ ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్ జెల్లా, సత్యపాల్ రెడ్డి పింగళి మాట్లాడుతూ, గతంలోనూ నాగరాజు సంస్థకు పలు విధాలుగా సహకరించారని, ఆయన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
టాక్ కార్యదర్శులు రవి రేతినేని, హరి గౌడ్, రవి పులుసు వేడుకలకు హాజరైన ప్రవాస సంఘాల ప్రతినిధులకు, స్పాన్సర్లకు, స్థానిక అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు టాక్ చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు ప్రవాసులు ప్రశంసించారు.
ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు
వేడుకల్లో భాగంగా ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి గోల్డ్ కాయిన్లను బహుమతిగా అందించారు. బతుకమ్మలను తీసుకొచ్చిన మహిళలకు ఇతర బహుమతులను కూడా అందజేశారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఈ వేడుకల్లో చేనేత వస్త్రాలకు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. చేనేత కుటుంబాలకు మేలు చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మున రెడ్డి, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, ప్రధాన కార్యదర్శులు సుప్రజ పులుసు, శ్రీకాంత్ జెల్లా, సత్యపాల్ రెడ్డి, కన్వీనర్ అశోక్ దూసరి, అడ్వైజరీ బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, ఈవెంట్స్ ఇన్చార్జి మల్లా రెడ్డి, గణేష్ కుప్పాల, పవిత్ర కంది, స్వాతి బుడగం, సత్యమూర్తి చిలుమల, వెంకట్ రెడ్డి దొంతుల, సత్యం కంది, రవి రేతినేని, రవి ప్రదీప్, హరి గౌడ్, క్రాంతి రేతినేని, జాహ్నవి, శశి, తేజ, నిఖిల్, నాగరాజు, ప్రవీణ్ వీర, యువజన విభాగం నాయకుడు తరుణ్ తదితరులు పాల్గొన్నారు.