మోదీకి శక్తిని అందించాలని అమ్మవారిని వేడుకున్నా : బండి సంజయ్

మోదీకి శక్తిని అందించాలని అమ్మవారిని వేడుకున్నా

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్, వెలుతురు, అక్టోబర్ 20 : హిందూ బంధువులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. మంగళవారం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో శమీ పూజ నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతాంగం బాధలు తొలగిపోవాలని, ఉద్యోగ, ఉపాధి లేక అల్లాడుతున్న నిరుద్యోగులకు భరోసా కలగాలని ఆకాంక్షించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల ప్రయోజనాలు కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. శక్తివంతమైన సమాజం నిర్మితమయ్యేలా ప్రతి ఒక్కరికీ శక్తిని ప్రసాదించాలని, సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరూ సేవలందించాలని ప్రార్థించినట్లు తెలిపారు.

దేశాన్ని సైనికుడిలా రక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అన్ని ఇబ్బందులు తొలగిపోవాలని అమ్మవారిని వేడుకున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాల కోసం కుట్రలు చేస్తూ దేశాన్ని అస్థిరపర్చే వారిపై కఠినంగా వ్యవహరించేలా మోదీకి అమ్మవారు శక్తిని అందించాలని కోరుకున్నట్లు తెలిపారు.

దేవీ నవరాత్రుల సందర్భంగా భవానీ దీక్షలు చేపట్టే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని బండి సంజయ్ అన్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వేలాది మంది భవానీ దీక్షలు చేపట్టడం శుభ పరిణామమని పేర్కొన్నారు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో నిర్వహించిన దేవీ నవరాత్రి ఉత్సవాలకు వేలాది మంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. ధార్మిక వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని ఆయన పేర్కొన్నారు.

Bandi Sanjaydasaraministerpooja
Comments (0)
Add Comment