ఇందిరమ్మ ఇళ్లపై పొంగులేటి కీలక ఆదేశాలు
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 23 :
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో ప్రతిపాదించిన ఇందిరమ్మ టవర్ల నిర్మాణం కోసం యుద్ధప్రాతిపదికన భూములను గుర్తించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్లతో కలిసి ‘క్యూర్’ ఇందిరమ్మ టవర్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకాల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, క్యూర్ పరిధిలో మూడు దశల్లో మొత్తం లక్ష ఇందిరమ్మ ఫ్లాట్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కొనసాగుతున్న మొదటి దశతో పాటు, రెండు, మూడవ దశలకు అవసరమైన భూములను త్వరితగతిన సేకరించాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపిక కోసం నిర్వహించే లాటరీ ప్రక్రియను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
నగరంలోని పేదలకు వారి నివాస ప్రాంతాలకు, ఉపాధి మార్గాలకు సమీపంలోనే గృహ వసతి కల్పించాలనేదే ఇందిరమ్మ టవర్ల ప్రధాన ఉద్దేశమని మంత్రి వివరించారు. పేదలను నగర శివార్లకు తరలించకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందే వారికి ఫ్లాట్‌పై పూర్తి యాజమాన్య హక్కులతో పాటు, అవిభాజ్య భూమి వాటాను ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా అందజేస్తామని హామీ ఇచ్చారు.