మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో చర్చలు : సీఎం రేవంత్

మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో చర్చలు : సీఎం రేవంత్

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 23 :  తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరిగే చర్చలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవలే సూచనప్రాయంగా తెలియజేశారని సీఎం వెల్లడించారు. శుక్రవారం బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

 

తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌తో పాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టులపై పీటముడిగా ఉన్న అంశాలన్నింటినీ ఈ సమావేశంలో చర్చించారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మిస్తే ఎంత నీటిని తెచ్చుకునే వీలుంది.. 150 మీటర్ల ఎత్తున ఎంత నీటిని ఎల్లంపల్లి వరకు తెచ్చుకునే వీలుందనే వివరాలను ఇరిగేషన్ ఇంజనీర్లు సీఎంకు వివరించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్ర పరిధిలో ఎక్కడ కూడా గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం లేదని వివరించారు. 152 మీటర్ల ఎత్తున నిర్మిస్తే దాదాపు 2300 ఎకరాల భూములు ముంపునకు గురవుతాయని, 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే వెయ్యి ఎకరాల లోపే ముంపు ప్రభావం ఉంటుందని వివరించారు.

cmRevanth ReddyTelangana
Comments (0)
Add Comment