ఆత్మకూరులో 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి వాకిటి
ఆత్మకూరు(వనపర్తి జిల్లా), వెలుతురు, అక్టోబర్ 24 :
ఆత్మకూరు పట్టణంలో 28 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 50 పడకల ఆసుపత్రి
నిర్మాణ పనులను మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఆధునిక వైద్య సదుపాయాలతో ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఆత్మకూరు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.
అత్యవసర వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గి, స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఆసుపత్రి నిర్మాణాన్ని నిర్ణీత ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.