బహదూర్‌పురా, కార్వాన్ నియోజకవర్గాల లబ్ధిదారులకు “డబుల్ ” ఇండ్లు
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 24:
హైదరాబాద్ కలెక్టరేట్‌లో బహదూర్‌పురా, కార్వాన్ నియోజకవర్గాలకు చెందిన 216 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ (2BHK) ఇళ్ల మంజూరు పత్రాలు, పట్టాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. అనంతరం అవిభక్త కవలలు వీణా–వాణితో పాటు అనాథ పిల్లలకు యూనిక్ డిసేబిలిటీ ఐడెంటిటీ కార్డులు (UDID), ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ ముబీన్, కౌసర్ మొహియుద్దీన్, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బహదూర్‌పురా, కార్వాన్ నియోజకవర్గాలకు చెందిన మొత్తం 216 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బహదూర్‌పురా నియోజకవర్గంలోని లబ్ధిదారుల కోసం ఫారూఖ్‌నగర్ 2BHK కాలనీలో 136 ఇళ్లు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే కార్వాన్ నియోజకవర్గంలోని ఆసిఫ్‌నగర్, గోల్కొండ, షేక్‌పేట్ మండలాల పరిధిలోని లబ్ధిదారులకు మల్లాపూర్–బాలాపూర్ 2BHK కాలనీలో 80 ఇళ్లు కేటాయించి పట్టాలు అందజేస్తున్నట్లు వివరించారు.
అర్హులైన పేదలకు ఇళ్లు..
ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకతతో అర్హులైన పేద కుటుంబాలను గుర్తించి ఇళ్లను కేటాయిస్తున్నామని మంత్రి తెలిపారు. నిరుపేద కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలు పొందుతున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో పేదలకు సొంత ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. మొదటి దశలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, రెండో దశలో మరో 2,000 ఇళ్లు మంజూరు చేసినట్లు వివరించారు. గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు ప్రాధాన్యతనిస్తూ ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో విలువైన స్థలాల్లో నివసించే పేదలకు వారి నియోజకవర్గాల పరిధిలోనే ఇందిరమ్మ టవర్లను నిర్మించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే ఆషాఢ మాసంలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. నగరంలో భూమి ఉన్నవారికి కూడా ఇందిరమ్మ ఇళ్లను అందించే అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు..
ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ.. రేషన్ కార్డులు లేని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తామని, పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు 367 కోట్ల ప్రయాణాలు జరిగాయని, మహిళలు రూ.12,888 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు. మహిళలకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.
వీణా–వాణితో పాటు అనాథ పిల్లలకు UDID కార్డులు, ధ్రువీకరణ పత్రాలు అందించడం ద్వారా అర్హులకు అవసరమైన గుర్తింపు, ప్రభుత్వ సేవలు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.
ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి..
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారని తెలిపారు. ఎల్‌నినో కారణంగా నీటి ఎద్దడి, విద్యుత్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలంతా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఉపయోగించిన నీటిని సాధ్యమైనంత వరకు తిరిగి వినియోగించుకునే విధానాలను అలవాటు చేసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి కోరారు.
పేదలకు ఇళ్ల కల్పన, మహిళల ఆర్థిక సాధికారత, సంక్షేమ పథకాల అమలు, నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.