వల్లాపురంలో 12 ఏళ్ల బాలుడి మృతి.. భయాందోళనతో గుండెపోటు వచ్చినట్లు అనుమానం
సూర్యాపేట, వెలుతురు, అక్టోబర్ 24 :
నడిగూడెం మండలం వల్లాపురంలో విషాదం చోటుచేసుకుంది. కోతుల గుంపు వెంబడించడంతో భయంతో పరుగులు తీసిన 12 ఏళ్ల బాలుడు కిందపడి మృతి చెందాడు. తీవ్ర భయాందోళన కారణంగా గుండెపోటు వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వల్లాపురానికి చెందిన మొక్క వీరబాబు దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వారి కుమారుడు నిశాంత్ గౌడ్ (12) దసరా సెలవుల కోసం గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. శుక్రవారం స్నేహితుడితో కలిసి అమ్మమ్మ ఇంటి నుంచి తమ సొంత ఇంటికి వెళ్తుండగా కోతుల గుంపు వారిని వెంబడించింది. వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసిన నిశాంత్ అదుపుతప్పి కిందపడటంతో కాలి బొటనవేలుకు గాయమైంది.
స్థానికులు బాలుడిని చికిత్స కోసం ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తొలుత ఆటోలో ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అంబులెన్స్ ఎదురైంది. దీంతో బాలుడిని అంబులెన్స్‌లోకి మార్చారు. అయితే, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు.
తీవ్రమైన భయాందోళనతో గుండెపోటు వచ్చి బాలుడు మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని నడిగూడెం ఎస్ఐ తేజస్విని తెలిపారు.