స్కూల్‌ బస్సులపై ఆర్టీఏ కొరడా

  •  రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల వాహనాల తనిఖీలు
  • వెయ్యికిపైగా స్కూల్‌ బస్సుల పరిశీలన
  • నిబంధనలు ఉల్లంఘించిన బస్సులపై కేసులు
  • 150కుపైగా వాహనాలపై చర్యలు
  • ఫిట్‌నెస్‌ లేని బస్సులపై కఠిన నిర్ణయం
  • 35 విద్యాసంస్థల వాహనాల సీజ్‌
  • విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యమన్న అధికారులు
  • రవాణా నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి
  • యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ
  • తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం

హైదరాబాద్ వెలుతురు జూన్ 15: తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరుచుకున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రవాణాశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బస్సులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలకు విద్యార్థులను తరలిస్తున్న వాహనాలు నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా లేదా అన్న అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇవాళ వెయ్యికిపైగా స్కూల్‌ బస్సులను ఆర్టీఏ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, బీమా, పర్మిట్లు, అత్యవసర భద్రతా పరికరాలు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు, అగ్నిమాపక పరికరాలు, డ్రైవర్ల అర్హతలు, వాహనాల సాంకేతిక స్థితి వంటి అంశాలను పరిశీలించారు.

తనిఖీల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 150కుపైగా స్కూల్‌ బస్సులను గుర్తించిన అధికారులు వాటిపై కేసులు నమోదు చేశారు. కొన్ని వాహనాల్లో అవసరమైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం, మరికొన్నింటిలో పత్రాలు సక్రమంగా లేకపోవడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి.

అదేవిధంగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండా విద్యార్థులను తరలిస్తున్న 35 విద్యాసంస్థల వాహనాలను అధికారులు సీజ్‌ చేశారు. విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారే పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

విద్యాసంస్థల యాజమాన్యాలు రవాణా నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూల్‌ బస్సుల తనిఖీలు రానున్న రోజుల్లో కూడా కొనసాగుతాయని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.

Comments (0)
Add Comment