- మోడీని ప్రపంచ దేశాల అధినేతలు తమకు ఆదర్శంగా తీసుకుంటున్నాయి
- ప్రజల్లో తనపై పెచ్చురిల్లుతున్న వ్యతిరేకతతో రేవంత్ కు మతి భ్రమించింది
- డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కిషన్ రెడ్డిపై, రాంచందర్ రావుపై సీఎం తప్పుడు వ్యాఖ్యలు
- బీజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప
హైదరాబాద్ వెలుతురు జూన్ 15: ప్రదానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడం అని గుర్తుంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిపై బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప మండిపడ్డారు. వరుసగా మూడు సార్లు ప్రధానికి ఎన్నికై, అత్యధిక రోజులు అంటే నెహ్రూ రికార్డును బద్దలు కొట్టి 4399 రోజుల మార్కును దాటిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదని సంగప్ప చెప్పారు. ప్రపంచ దేశాల అధినేతలు నరేంద్ర మోడీని తమ మెంటర్ గా, తమకు ఆదర్శంగా భావిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఆయనపై వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని సంగప్ప అన్నారు.
రోజు రోజుకు రాష్ట్ర ప్రభుత్వంపైనా, తనపైనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతుండటంతో సీఎం రేవంత్ రెడ్డికి మతిభ్రమిస్తోందని, అందుకే బిజేపి నేతలపై అవాకులు చవాకులు పేలుతున్నారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైనా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచదర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సంగప్ప తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన 6 గ్యారంటీలను, 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం కావడంతో గ్రామం నుంచి పట్టణం దాకా ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన అన్నారు. పైగా వర్షాలకు వరి ధాన్యం తడిసిపోవడం, రైతులకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం కావకడం, హైదరాబాద్ సహా పట్టణాల్లో వర్షాకాలానికి చేసుకోవల్సిన ఏర్పాట్లు చేయకపోవడంతో జనం రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని సంగప్ప చేప్పారు. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిందని, గంటల తరబడి నగరవాసులు ట్రాఫిక్ లో నరకం చూశారని ఆయన అన్నారు. వీటన్నిటీకి సమాధానం చెప్పలేక సీఎం రేవంత్ రెడ్డి బిజెపి పై బుదర చల్లి ప్రజల మైండ్ ను డైవర్ట్ చేయాలని చూస్తున్నారని సంగప్ప అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలు తమకు కావల్సిన నిధుల కోసం కాని, గ్రాంట్స్ కోసం కాని, రుణాల కోసం కాని అర్జీ పెట్టుకోవడానికి ఒక పద్దతి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రెస్ మీట్లలో డిమాండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం భయపడి పోయి నిధులు ఇవ్వరన్న విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని సంగప్ప పేర్కొన్నారు.
ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి దొరుకుతుందని, ఇక కేంద్ర మంత్రుల దగ్గరికైతే ఆయన వాకిన్ లో వెళ్తున్నారని సంగప్ప గుర్తుచేశారు. అలాంటప్పుడు మీకు కావల్సిన దాన్ని మీరు అక్కడ అడుక్కోవచ్చని ఆయన అన్నారు. కేవలం ఉద్ధేశపూర్వకంగానే కిషన్ రెడ్డి పై రేవంత్ బట్ట కాల్చి మీద వేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచదర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యాంగా మాట్లాడరని సంగప్ప మండిపడ్డారు. కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బిజెపికి రాంచందర్ రావు రాష్ట్ర అధ్యక్షుడన్న విషయాన్ని సీఎం రేవంత్ మరచిపోవద్దని సంగప్ప గుర్తుచేశారు. పైగా ఆయన మాటలు ఒక కులాన్ని కించపరిచేలా ఉన్నాయని విమర్శించారు.