-
సాంకేతికతతో సాగుకు కొత్త దిశ – మంత్రి తుమ్మల
- ప్రభుత్వం సూచించిన 7 వరి రకాలకే ప్రాధాన్యం.. కంపెనీలకు మంత్రి తుమ్మల ఆదేశం
- యూరియా యాప్ పై వివిధ జిల్లాల నుండి వచ్చిన అధికృత డీలర్ల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుతురు జూన్ 17: నిన్న ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై నిర్వహించిన సమీక్షా సమావేశం నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సచివాలయంలో వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించారు. విత్తన కంపెనీల ప్రతినిధులు, ఎరువుల డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, కృషి వాస్ ప్రతినిధులతో విడివిడిగా సమావేశమై ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు.
*ప్రభుత్వం సూచించిన ఏడు వరి రకాల విత్తనాలకే ప్రాధాన్యంః **
విత్తన కంపెనీలతో జరిగిన సమావేశంలో మార్కెట్ డిమాండ్, మిల్లర్ల సూచనలు, ఎగుమతి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఏడు వరి రకాల విత్తనాల లభ్యతపై మంత్రి తుమ్మల సమీక్షించారు. బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సొన), హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్ఎం-7715 రకాల విత్తనాలను రైతులకు విస్తృతంగా అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఈ రకాల వరికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో పాటు ఎగుమతులకు కూడా అవకాశాలు ఉన్నాయని, ముఖ్యమంత్రి కూడా వీటి సాగును ప్రోత్సహించాలని సూచించినట్లు మంత్రి తెలిపారు. గతంలో రాష్ట్రంలో దొడ్డు రకాల సాగు 60 శాతం, సన్న రకాల సాగు 40 శాతం ఉండేదని, ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించిన తర్వాత పరిస్థితి మారి ప్రస్తుతం సన్న రకాల సాగు 60 శాతానికి చేరుకుందని వివరించారు.
ప్రభుత్వం సూచించిన విత్తనాలను రైతులకు ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని కంపెనీలకు ఆదేశించారు. రైతులకు విత్తనాల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని స్పష్టం చేశారు. ఈ రకాలను ఏ రైతు ఎంత విత్తనం కొనుగోలు చేశాడనే వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఆదేశించారు.
విత్తన సబ్సిడీపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని, వ్యవసాయ యాంత్రీకరణ పథకం తరహాలో సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విత్తనాల పంపిణీ కోసం అవసరమైతే రైతు వేదికలను ప్రత్యేక కేంద్రాలుగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని చెప్పారు.
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ ఏడు వరి రకాలకే బోనస్ వర్తిస్తుందని స్పష్టం చేసిన మంత్రి, కంపెనీల వారీగా అందుబాటులో ఉన్న విత్తనాల నిల్వలను రైతులకు తెలిసేలా ప్రదర్శించాలని సూచించారు. అదేవిధంగా ఆయా రకాల అమ్మకం, విక్రయాలను రోజువారిగా అప్ డేట్ చేయాల్సిందిగా డీలర్లను ఆదేశించారు.
*ఎరువుల సరఫరాలో రైతులకు ఇబ్బందులు రాకూడదుః*
ఫెర్టిలైజర్ డీలర్లతో జరిగిన సమావేశంలో ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల సరఫరా, పంపిణీ అంశాలపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్ వినియోగదారులకు, డీలర్లకు అనుకూలంగా ఉందని డీలర్లు అభిప్రాయపడ్డారు. రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం ప్రభుత్వంతో పాటు డీలర్ల బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. అవసరమైతే రైతు వేదికలను తాత్కాలిక విక్రయ కేంద్రాలుగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
దేశంలోనే తొలిసారిగా భూమికి అనుసంధానం చేసి, సాగు విస్తీర్ణం ఆధారంగా యూరియా పంపిణీ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం యూరియా యాప్‌ను రూపొందించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ అమలు చేస్తున్న ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు కూడా పైటల్ ప్రాతిపదికన అములకు సన్నాహాలు చేస్తున్నాయని చెప్పారు. సాంకేతికతను వినియోగించి సరైన రైతుకు, సరైన పరిమాణంలో యూరియా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
గతంలో కేవలం ఆధార్ కార్డు చూపించి పెద్ద మొత్తంలో యూరియా కొనుగోలు చేసే అవకాశం ఉండేదని, ప్రస్తుతం యాప్ ఆధారిత విధానంతో అలాంటి పరిస్థితులకు పూర్తిగా అడ్డుకట్ట పడిందని చెప్పారు. అధిక యూరియా వినియోగం వల్ల కలిగే నష్టాలపై డీలర్లు కూడా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా యూరియా దిగుమతులపై ప్రభావం పడుతున్నప్పటికీ రాష్ట్ర రైతులకు అవసరమైన ఎరువులు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా యాప్ పనితీరు పట్ల పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేసిన డీలర్లు, మండలాల వారీగా మ్యాపింగ్ సదుపాయం కల్పించాలని కోరారు. అలాగే రవాణా ఖర్చులు తమపై అదనపు భారం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న రవాణా వ్యయాల కారణంగా రిటైల్ వ్యాపారులు అధిక ధరలకు యూరియా విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాక యాప్ వచ్చిన తరువాత ఎక్కడా రద్దీ సమస్య లేదని, రైతులు వారికి సౌకర్యవంతమైన సమయంలో వచ్చి బస్తాలు కొనుగోలు చేస్తున్నారని మంత్రికి తెలియచేశారు. ఈ యాప్ తెచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఙతలు తెలియజేశారు.
*శాటిలైట్ సాంకేతికతతో చీడపీడల గుర్తింపుః*
కృషి వాస్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలో వినియోగించే విధానాలపై మంత్రి తుమ్మల సమీక్షించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా పంటల్లో చీడపీడలను, వ్యాధులను రియల్ టైమ్‌లో గుర్తించి, అవి విస్తరించకముందే రైతులకు సమాచారం అందించే విధంగా కృషి వాస్ ప్రాజెక్ట్ పనిచేస్తోందని కంపెనీ ప్రతినిధులు వివరించారు.
ఈ విధానం ద్వారా రైతులు ప్రతిరోజూ పొలాల్లో తిరిగి వ్యాధులను గుర్తించాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు. రైతులకు ముందస్తు హెచ్చరికలతో పాటు అవసరమైన పురుగుమందులపై సూచనలు కూడా అందించడంతో వ్యాధుల వ్యాప్తిని నివారించి దిగుబడులను కాపాడుకోవచ్చని చెప్పారు.
ఈ ప్రాజెక్టు పైలట్ అమలుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలాన్ని ఎంపిక చేసినట్లు ప్రతినిధులు వివరించారు. అక్కడి రైతులకు ఇప్పటికే పంటల పరిస్థితులపై సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కృషి వాస్ సేవల ద్వారా లబ్ధి పొందిన దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామానికి చెందిన పెరుమళ్ళ వీరభద్రరావు అనే రైతుకు మంత్రి తుమ్మల స్వయంగా ఫోన్ చేసి, ప్రాజెక్టు వల్ల కలిగిన ప్రయోజనాలు మరియు కంపెనీ తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. కంపెనీ వారు ఉపయోగించిన సాంకేతికత, యూనివర్సిటీ ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాంకేతికతలో తారతమ్యాలని యూనివర్సిటీ అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఉన్న ఉత్తమ సాంకేతికతను మన తెలంగాణ రైతులకు అందుబాటులోకి తేవాలన్నది తమ ప్రభుత్వ ధ్యేయమని, ఈ పంట కాలానికి సాంకేతిక ఫలాలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశాల్లో సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ సంచాలకులు బి. గోపి, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ రాజ్, సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ యాస్మిన్ బాషా, అగ్రికల్చర్ యూనివర్సిటీ విసి అల్దాస్ జానయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.