వాష్‌రూమ్‌లో దాచి.. తర్వాత బయటకు అయోధ్య విరాళాల చోరీలో సంచలన విషయాలు

విరాళాల లెక్కింపు వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకున్న నిందితులు

తాళాలు సంపాదించి ఎవరూ లేని సమయంలో నగదు అపహరణ

సీసీటీవీ నిఘాపై పూర్తి అవగాహనతో చోరీకి పాల్పడిన ముఠా

దొంగిలించిన నగదును వాష్‌రూమ్‌ల్లో దాచి బయటకు తరలింపు

ఎనిమిది మంది నిందితుల అరెస్టుతో వేగం పుంజుకున్న దర్యాప్తు

విచారణలో కీలక విషయాలు వెల్లడించిన ప్రధాన నిందితుడు

చోరీ సొమ్ముతో ఇల్లు, స్థలం కొనుగోలు చేసినట్లు అంగీకారం

నిందితుల ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా

ముఠా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కొనసాగుతున్న దర్యాప్తు

 

అయోధ్య వెలుతురు జూలై 01:

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామాలయ విరాళాల అపహరణ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆలయంలోని విరాళాల లెక్కింపు వ్యవస్థలో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని నిందితులు చాలా కాలంగా చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించారు.

కోర్టు అనుమతితో ప్రధాన నిందితుల్లో ఒకడైన అవినాష్‌ శుక్లాను పోలీసులు రెండు గంటలపాటు ప్రశ్నించారు. విచారణలో అతడు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. విరాళాల లెక్కింపు గదికి సంబంధించిన తాళాలను మరో నిందితుడు టిన్నూ యాదవ్‌ సంపాదించాడని, అనంతరం ఎవరూ లేని సమయంలో గదిలోని నగదును అపహరించినట్లు అతడు అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

దర్యాప్తులో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఆలయ ప్రాంగణంలో ఎక్కడెక్కడ నిఘా కెమెరాలు ఉన్నాయో, వాటిని ఎప్పుడు, ఎవరు పరిశీలిస్తారో నిందితులకు పూర్తిగా తెలుసని అధికారులు గుర్తించారు. ఈ సమాచారాన్ని అనుకూలంగా మలుచుకున్న వారు కెమెరాలకు చిక్కకుండా దొంగిలించిన నగదును ముందుగా ఆలయ ప్రాంగణంలోని వాష్‌రూమ్‌ల్లో దాచేవారని, తర్వాత అనుమానం రాకుండా సమయం చూసుకుని బయటకు తరలించేవారని విచారణలో తేలినట్లు తెలుస్తోంది.

శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ నిర్వాహకులతో తమకు సాన్నిహిత్యం ఉండటంతో ఎవరూ తమపై అనుమానం వ్యక్తం చేయలేదని అవినాష్‌ శుక్లా విచారణలో చెప్పినట్లు సమాచారం. ఈ పరిచయాన్ని అడ్డంగా పెట్టుకుని చాలా కాలంగా చోరీలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

చోరీ చేసిన నగదుతో తాను ఇల్లు, స్థలం కొనుగోలు చేసినట్లు కూడా అవినాష్‌ శుక్లా అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో అతడి ఆర్థిక లావాదేవీలతో పాటు ఇతర నిందితుల ఆస్తులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్ము మరెక్కడికైనా మళ్లించారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

అంతేకాకుండా ఈ చోరీలు చాలా కాలంగా సాగుతున్నప్పటికీ ఎవరికీ అనుమానం రాకుండా ఎలా నిర్వహించగలిగారు, నిందితులకు ఆలయ వ్యవస్థలోని ఇతరుల నుంచి సహకారం లభించిందా, ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా అనే అంశాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా నిందితులు పలుమార్లు ట్రస్టీ అనిల్‌ మిశ్రా పేరును ప్రస్తావించినట్లు సమాచారం. ఈ కేసు వెలుగులోకి వచ్చిన అనంతరం ఆయన ట్రస్టు సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Ayodhya NewsAyodhya Ram MandirRam Janmabhoomi Teerth Kshetra TrustRam Mandir Donation
Comments (0)
Add Comment