చెక్ రిపబ్లిక్ దేశంలో గురువారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రాగ్ నగరంలోని చార్ల్స్ యూనివర్సిటీలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడటంతో ఏకంగా 15 మంది మృతి చెందారు. మరో 30 మంది గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని మట్టుబెట్టారు. యూనివర్సిటీలోని ఆర్ట్స్ విభాగం వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది.
కాగా, నిందితుడు తొలుత తన తండ్రిని చంపి ఆపై యూనివర్సిటీలో కాల్పులకు తెగబడ్డట్టు తెలుస్తోంది. నిందితుడి కోసం పోలీసుల గాలింపు చేపట్టిన తరుణంలోనే ప్రాగ్ నగరానికి చేరుకున్న అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీస్ చీఫ్ మార్టిన్ వాండ్రసెక్ పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రాగ్ వస్తున్న నిందితుడి కోసం పోలీసులు ఆర్ట్స్ విభాగం భవంతిలో గాలిస్తుండగా అతడు మరో భవనంలోకి వెళ్లాడు. కాగా, రష్యాలో గతంలో ఇలాంటి ఓ ఘటనే జరిగిందని, దాని స్ఫూర్తితో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
ఘటనపై చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు దిగ్భ్రాంతికి లోనయ్యారు. బాధిత కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు. ఘటనపై ఇతర ఐరోపా దేశాధినేతలు విచారం వ్యక్తం చేశారు. 1993లో స్వతంత్ర దేశంగా అవతరించిన తరువాత జరిగిన అత్యంత దారుణమైన కాల్పుల ఘటన ఇదే కావడంతో యావత్ దేశం షాక్‌లో కూరుకుపోయింది.