మెక్సికోలో దారుణం: ఉత్సాహంగా జరుగుతున్న పార్టీలో కాల్పులు.. ఆరుగురి మృతి

ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్న ఓ పార్టీలో నలుగురు సాయుధులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు 18 ఏళ్లలోపు వారే. గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారులున్నారు. మెక్సికోలోని సియుడాడ్ ఒబ్రెగాన్ నగరంలో ఈ తెల్లవారుజామున జరిగిందీ ఘటన. హత్యకేసు అభియోగాలు ఎదుర్కొంటున్న అనుమానిత కార్టెల్ సభ్యుడిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగాయి. కార్టెల్ సభ్యుడు పారిపోవడానికి ప్రయత్నించాడని, కానీ కాల్పుల్లో మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

కాల్పులు జరిపిన నలుగులు సాయుధుల్లో ఒకడు అప్పటికే పార్టీలో ఉన్నట్టు పేర్కొన్నారు. కాల్పుల అనంతరం సాయుధులు నలుగురు తప్పించుకున్నారని తెలిపారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వివరించారు. మెక్సికో అనగానే డ్రగ్స్ యుద్ధాలు గుర్తొస్తాయి. ఇక్కడ డ్రగ్ ముఠాల మధ్య నిత్యం ఆధిపత్యపోరు జరుగుతూ ఉంటుంది. ఈ పోరులో 2006 నుంచి ఇప్పటి వరకు వేలాదిమంది మరణించారు. ఈ నెల 17న క్రిస్మస్ సీజన్ పార్టీలో జరిగిన దాడిలో ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది గాయపడ్డారు. అంతకుముందు 9న జరిగిన గన్‌మెన్లకు, క్రిమినల్ గ్యాంగ్‌కు మధ్య జరిగిన ఘర్షనలో 11 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు.

Leave A Reply

Your email address will not be published.