భారత ఐటీ పరిశ్రమ “ఏఐ యాజ్ ఎ సర్వీస్” దిశగా ముందుకు సాగాలి: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

  • భారత ఐటీ పరిశ్రమ “ఏఐ యాజ్ ఎ సర్వీస్” దిశగా ముందుకు సాగాలి
  • ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత కింద భారత ఏఐ, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ వృద్ధిలో హైదరాబాద్ పాత్ర కీలకం: కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్

హైదరాబాద్ వెలుతురు 11జులై:

భారత్ సొంతమైన విశ్వసనీయ ప్రపంచ ఖ్యాతిని, నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను సద్వినియోగం చేసుకుంటూ… భారత ఐటీ పరిశ్రమ సాఫ్ట్‌వేర్ సేవల ఆధారిత నమూనా నుంచి “ఏఐ యాజ్ ఏ సర్వీస్” నమూనాకు మారాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేలు, సమాచార, ప్రసార శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హెచ్‌వైఎస్ఈఏ) ఆధ్వర్యంలో “వికసిత్ భారత్-2047 నిర్మాణంలో సాంకేతికత పాత్ర” అనే అంశంపై హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండస్ట్రీ లీడర్ టౌన్‌హాల్‌లో శ్రీ వైష్ణవ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమం అనంతరం పరిశ్రమ ప్రముఖులతో రౌండ్‌టేబుల్ చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ వైష్ణవ్‌తో పాటు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

పరిశ్రమల ప్రముఖులనుద్దేశించి శ్రీ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ… ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వికసిత్ భారత్-2047 దార్శనికతకు అనుగుణంగా కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తయారీ, అధునాతన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారత తదుపరి దశ వృద్ధి సాధ్యమవుతోందన్నారు.

ఐటీ పరిశ్రమను కృత్రిమ మేధ మౌలికంగా మార్చేసిందని పేర్కొంటూ… ప్రతీ కొత్త ఏఐ నమూనా కొత్త సామర్థ్యాలనూ, అవకాశాలనూ తీసుకువస్తుందన్నారు. పరిశ్రమలను అర్థం చేసుకోవడం, సమస్యలను గుర్తించడం, సమర్థమైన సాంకేతికత ఆధారిత పరిష్కారాలను అందించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన విశ్వాసమే భారత్ అతిపెద్ద బలమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

వ్యూహాత్మక మార్పు ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావిస్తూ… భారత ఐటీ పరిశ్రమ ఇప్పుడు సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ నమూనాను దాటి, ఏఐని ఒక సేవగా అందించే (ఏఐ యాజ్ ఎ సర్వీస్) నమూనా దిశగా పరిణామం చెందాలని శ్రీ వైష్ణవ్ సూచించారు. పరిశ్రమల, విద్యాసంస్థల మధ్య సన్నిహిత సహకారంతో ఈ పరివర్తనను ముందుకు నడిపించాలని ఆయన కోరారు. ఇటీవలి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ… కృత్రిమ మేధలోని తాజా పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు, ప్రభుత్వ భాగస్వామ్యంతో నాస్కామ్ ఒక సమగ్ర ఏఐ పాఠ్యప్రణాళికను అభివృద్ధి చేసిందని తెలిపారు. దానిని విద్యా మంత్రిత్వ శాఖ, ఏఐసీటీఈతో పంచుకున్నామని శ్రీ వైష్ణవ్ వివరించారు.

సెమీకండక్టర్ల తయారీ రంగంలో దేశం సాధించిన పురోగతిని వివరిస్తూ, 1960ల నుంచే భారత్ ఒక సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించాలని ఆకాంక్షించిందన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రత్యేక కృషి వల్ల ఆ దార్శనికత ఇప్పుడు వాస్తవరూపం దాల్చిందని శ్రీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం 12 సెమీకండక్టర్ తయారీ ప్లాంట్లు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయని తెలిపారు. వాటిలో మూడు ప్లాంట్లు ఇప్పటికే జపాన్, యూరప్, దేశీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్న చిప్‌లను ఉత్పత్తి చేస్తున్నాయనీ ఆయన వివరించారు.

దేశంలో అభివృద్ధి చెందుతున్న సెమీకండక్టర్ డిజైన్ వ్యవస్థ, దానికి తోడు ప్రపంచవ్యాప్తంగా నిపుణుల కొరత ఉండటం ఐటీ పరిశ్రమకు ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తోందని కేంద్ర మంత్రి అన్నారు. వినూత్నమైన సెమీకండక్టర్ పరిష్కారాలను రూపొందించడం కోసం ఎలక్ట్రానిక్స్, ఐటీ, డిజైన్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ రంగాల్లో తమకున్న బలాన్నీ, అనుభవాన్నీ ఉపయోగించుకోవాలని ఆయన కంపెనీలను ప్రోత్సహించారు. ప్రతిభావంతుల లభ్యతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం 315 విశ్వవిద్యాలయాలకు అధునాతన సెమీకండక్టర్ డిజైన్ సాధనాలను అందుబాటులోకి తెచ్చిందనీ శ్రీ వైష్ణవ్ తెలిపారు.

ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంపై శ్రీ వైష్ణవ్ మాట్లాడుతూ… ఈ రంగంలో భారత్ అపూర్వ వృద్ధిని సాధిస్తోందన్నారు. గత సంవత్సరం మొబైల్ ఫోన్లు దేశంలోనే అతిపెద్ద ఎగుమతి విభాగంగా ఆవిర్భవించాయని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం విలువ ప్రస్తుత రూ. 13 లక్షల కోట్ల నుంచి సమీప భవిష్యత్తులోనే రూ. 20 లక్షల కోట్లకు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. ఒక్క తెలంగాణలోనే, కేంద్ర ప్రభుత్వం 104 ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల ఏర్పాటుకు మద్దతునిచ్చిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నాలుగు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లనూ మంజూరు చేసిందనీ, ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ)నీ ఏర్పాటు చేసిందని ఆయన వివరించారు.

Leave A Reply

Your email address will not be published.