- కాలినడకన వచ్చిన వృద్ధురాలికి ప్రత్యేక దర్శనం
- తితిదే ఛైర్మన్ చొరవతో దర్శన ఏర్పాట్లు
- కుటుంబ సభ్యులతో కలిసి బ్రేక్ దర్శనం
- వేదాశీర్వచనంతో ఘనంగా సత్కరించిన పండితులు
- పట్టువస్త్రం, తీర్థప్రసాదాలు అందజేసిన ఈవో
- వృద్ధురాలి పాదాలకు నమస్కరించిన ఈవో
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
- తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా గుర్తింపు
- విజిలెన్స్ ద్వారా వివరాలు సేకరించిన తితిదే
- భక్తికి తితిదే ప్రత్యేక గౌరవం
తిరుపతి వెలుతురు జూలై 06:
శ్రీవారి దర్శనం కోసం 116 ఏళ్ల వయసులోనూ కాలినడకన తిరుమలకు చేరుకున్న వృద్ధురాలు నవనీతమ్మకు తితిదే ప్రత్యేక గౌరవం తెలిపింది. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు చొరవతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. అధికారులు వృద్ధురాలిని దగ్గరుండి శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లి అన్ని ఏర్పాట్లు చేశారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు నవనీతమ్మకు వేదాశీర్వచనం చేశారు. తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర ఆమెకు పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వృద్ధురాలి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం విశేషంగా నిలిచింది.
నవనీతమ్మ శనివారం అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. ఆమె నడుచుకుంటూ వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తొలుత ఆమె కర్ణాటకకు చెందినవారిగా ప్రచారం జరిగినప్పటికీ, తితిదే విజిలెన్స్ సిబ్బంది విచారణ చేపట్టి తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా గుర్తించారు. ప్రస్తుతం తిరుపతి జీవకోనలో బంధువుల వద్ద ఉంటున్నట్లు ఛైర్మన్‌కు సమాచారం అందించారు.
ఈ వివరాలు తెలిసిన వెంటనే బీఆర్ నాయుడు స్పందించి నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని అధికారులను ఆదేశించారు. దీంతో తితిదే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఆమెకు అత్యంత గౌరవప్రదంగా శ్రీవారి దర్శనం కల్పించారు. 116 ఏళ్ల వయసులోనూ శ్రీవారిపై ఆమె చూపిన అపార భక్తి, సంకల్పం పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది.
