రైతుల జీవితాలతో కాళేశ్వరం డ్రామాలు: ఈటల రాజేందర్

  • రైతుల జీవితాలతో కాళేశ్వరం డ్రామాలు
  • కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై ఈటల రాజేందర్ నిప్పులు
  • కరువులో మోటార్లు ఆన్ చేయకపోవడంపై ఆగ్రహం
  • రాజకీయాల కంటే నాకు తెలంగాణే ముఖ్య‌మ‌న్న ఈట‌ల‌
  • స్క్రిప్ట్ చదివే అలవాటు త‌న‌కు లేదంటూ కీల‌క వ్యాఖ్య‌లు
  • ఉత్తర తెలంగాణకు మిడ్ మానేరే ప్రధాన నీళ్ల జంక్షన్
  • ప్రాజెక్టుల మరమ్మతుల్లో జాప్యంపై తీవ్ర ధ్వజం
  • ఎగువన వర్షాలు పడుతున్నా ఎందుకు ఎత్తిపోయడం లేదు?
  • మేడిగడ్డలో ఉన్న నీటిని పంప్ చేయాలని డిమాండ్

హైదరాబాద్ వెలుతురు జూలై 10:

తెలంగాణ సమాజం, ఇక్కడి రైతాంగ ప్రయోజనాలే తనకు అత్యంత ప్రాధాన్యమని మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను తెలంగాణ మట్టిబిడ్డనని, ఉద్యమకారుడినని, అదే తన శాశ్వత గుర్తింపు అని పేర్కొన్నారు. తనకు ఎప్పుడైనా సరే మొదట తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని, ఆ తర్వాతే రాజకీయ పార్టీ అయినా, వ్యక్తిగత విషయాలైనా వస్తాయని తేల్చి చెప్పారు. రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా రైతులను, ప్రజలను నష్టపరచాలని చూస్తే చూస్తూ ఊరుకోనని, చీల్చి చెండాడుతానని హెచ్చరించారు. తాము స్వయం ప్రకాశితులమని, ఎవరో వెనుక ఉండి మాట్లాడిస్తేనో, స్క్రిప్ట్ రాసి ఇస్తేనో మాట్లాడే నీచ సంస్కృతి తమకు లేదని, అలాంటి ఆరోపణలు చేసే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా తనకు లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

రైల్వే వ్యవస్థకు కాజీపేట జంక్షన్ ఎంత కీలకమైనదో.. ఉత్తర తెలంగాణ సాగునీటి రంగానికి మిడ్ మానేరు డ్యామ్ అంతటి ప్రధాన నీళ్ల జంక్షన్ అని ఈటల రాజేందర్ అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఇంజనీరింగ్ నిర్మాణాలకు తక్షణమే మరమ్మతులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తోందని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో భయంకరమైన కరువు పరిస్థితులు వస్తాయని ముందే తెలిసినప్పటికీ, ప్రభుత్వం ఇంత బాధ్యతారాహిత్యంగా ఎందుకు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజకీయాల కోసం కాల్వల్లో నీళ్లు ఆపితే సహించేది లేదన్నారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వల కింద ఉన్న భూములకు కేవలం బోర్లు, బావుల ద్వారా మాత్రమే పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయడం అసాధ్యమనే కఠిన వాస్తవాన్ని సాగునీటిపై కనీస అవగాహన ఉన్నవారెవరైనా ఒప్పుకుంటారని చెప్పారు.

ప్రస్తుతం ఎగువ రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణలోని వివిధ ప్రాజెక్టుల్లోకి సహజంగానే వరద నీరు భారీగా వచ్చి చేరుతోందని ఈటల రాజేందర్ తెలిపారు. లోలెవల్ పాయింట్‌కు నీరు చేరుతున్నప్పటికీ, ప్రభుత్వం మోటార్లు ఆన్ చేసి ఆ నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని నిలదీశారు. తాము మేడిగడ్డ బ్యారేజీలో ప్రమాదకరంగా నీటిని పూర్తిగా నింపమని కోరడం లేదని, కనీసం అక్కడ అందుబాటులో ఉన్న నీటినైనా పంపుల ద్వారా ఎగువకు తరలించి ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి ప్రాజెక్టులను నింపాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం పంటల సీజన్ ప్రారంభమైనా పొలాలకు నీళ్లు ఇవ్వకుండా అన్నదాతలను కష్టాల పాలు చేయడం ఏమాత్రం భావ్యం కాదన్నారు.

సాగునీటి సంక్షోభంతో పాటు రాజధాని నగరం హైదరాబాద్‌కు ముంచుకొస్తున్న తాగునీటి ఎద్దడిపై ఈటల రాజేందర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మహానగరానికి అందాల్సిన నీటి పరిమాణంలో దాదాపు 107 ఎంజీడీల నీటి సరఫరా తక్కువగా ఉందని గణాంకాలతో సహా వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పుడే మేల్కొని జలాశయాలలో నీటి నిల్వలను పెంచకపోతే, రాబోయే రోజుల్లో నగరంలో తీవ్రమైన తాగునీటి కొరత ఏర్పడుతుందని హెచ్చరించారు. నీటి కొరత వస్తే సామాన్య ప్రజలు ఎటు పోవాలని, ఈ సమస్యకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ఆయన నిలదీశారు. తాము ఏ ఒక్క పార్టీని వ్యక్తిగతంగా తిట్టడానికి రాలేదని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి పనులు చేయాల్సిన వారిని మాత్రమే ప్రశ్నిస్తున్నానని స్పష్టం చేశారు.

నీళ్ల కోసమే, నిధుల కోసమే, తెలంగాణ ఆత్మగౌరవం కోసమే కోట్లాది మంది ప్రజలు ఉద్యమించిన సుదీర్ఘ చరిత్ర మనకుందని ఈటల గుర్తుచేశారు. ఈనాడు రాజకీయాలు, సిద్ధాంతాలు వేరైనప్పటికీ స్వరాష్ట్ర జల మూలాలను మరిచిపోవడం దుర్మార్గమన్నారు. చాలా మంది నేతలు చరిత్రను పూర్తిగా విస్మరించి మాట్లాడుతున్నారని, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందే ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ‘జలయజ్ఞం’ పేరిట ఈ ప్రాంతానికి నీటిని తెచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. జలయజ్ఞంలో భాగంగానే తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నది నీళ్లను తెలంగాణకు మళ్లించాలని తొలుత ప్లాన్ చేశారని, తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే 24 టీఎంసీల సామర్థ్యంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని చారిత్రక అంశాలను వివరించారు.

ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ ప్రాజెక్టుల పురోగతిని అడ్డుకోవడం సరికాదని ఈటల రాజేందర్ హితవు పలికారు. గతంలో దేవాదుల ఎత్తిపోతల పథకానికి ఎలాంటి శాశ్వత బ్యారేజీ లేకపోయినప్పటికీ, అందుబాటులో ఉన్న సాంకేతికతను వాడుకుని నది నుంచి విజయవంతంగా నీటిని పంపింగ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాళేశ్వరం విషయంలో కూడా సాంకేతిక సాకులు, నివేదికల పేరుతో కాలయాపన చేయడం ఆపాలని కోరారు. శ్రీపాద ఎల్లంపల్లి, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ద్వారా కాళేశ్వరం నీళ్లు చేవెళ్ల వరకు రావాలనే మొదటి ఆలోచన, పునాది వేసింది కాంగ్రెస్ పార్టీనే అనే విషయాన్ని నేటి ఆ పార్టీ నాయకులు మరిచిపోవద్దని హితవు పలికారు.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇక్కడి పొలాలకు కడుపునిండా నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించేలా మునుపటి ప్రభుత్వం ప్రాజెక్టులను అనుసంధానించిందని ఈటల పేర్కొన్నారు. ఆ వ్యవస్థ ద్వారా వచ్చిన 29 టీఎంసీల నీళ్లే నేడు మిడ్ మానేరులో నిల్వ ఉన్నాయని తెలిపారు. గతంలో పోచంపాడు (90 టీఎంసీలు), ఎల్ఎండీ (24 టీఎంసీలు) కెపాసిటీ ఉన్నప్పటికీ, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్క పంటకు కూడా సరిగ్గా నీళ్లు అందేవి కావన్నారు. తాను హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వచ్చిన వేళ తూములు ఎత్తించి రైతులకు హీరో అయ్యానని గుర్తుచేసుకున్నారు. కాళేశ్వరం లింక్ అయిన తర్వాతే మిడ్ మానేరు నిధులతో కరీంనగర్, హుజూరాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో సంపూర్ణంగా రెండు పంటలు పండుతున్న మాట పచ్చి నిజం కాదా అని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన డిజైన్ల మార్పులు, కాంట్రాక్టులు, కమీషన్ల అవినీతి గురించి తాను మాట్లాడటం లేదని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవచ్చని ఈటల స్పష్టం చేశారు. అయితే, అసలు ఆ ప్రాజెక్టు కట్టడమే ఒక పెద్ద తప్పు అన్నట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడటం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ప్రాజెక్టుపై కక్షతో సాగునీటి సరఫరాను నిలిపివేసి రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని ‘ఖబర్దార్’ అంటూ హెచ్చరించారు. గతంలో ఒకవేళ నీళ్లు వరంగల్ వాసులకు చేరకపోతే తనపై ఇక్కడి ప్రజలు చిందులు తొక్కేవారని, నీటి విలువ రైతులకు మాత్రమే తెలుస్తుందని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్‌ఎస్ పార్టీలు కాళేశ్వరంపై ఆడుతున్న రాజకీయ డ్రామాలను పక్కనబెట్టి, అన్నదాతల పంటలను కాపాడటానికి తక్షణమే పంపింగ్ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.