ముంబై వెలుతురు జూలై 12:
ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం (జులై 12) ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. చంద్రబాబుతో పాటు మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్‌ని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పవన్‌తో సుమారు అరగంటకు పైగా చంద్రబాబు మాట్లాడారు. వైద్యుల సూచనలు, చికిత్స గురించి ఆరా తీశారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అవసరమైన అన్ని వైద్య సహాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి యాజమాన్యం ఆదివారం (జూలై 12)న అధికారికంగా ఒక ప్రత్యేక హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఆయన కుడి భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నారని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆసుపత్రి ఆర్థ్రోస్కోపీ అండ్ షోల్డర్ సర్వీస్ డైరెక్టర్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ దిన్‌షా పార్దీవాలా ఈ ప్రకటన జారీ చేశారు.

