కాళేశ్వరం అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ డ్రామాలు: కేంద్ర మంత్రి బండి సంజయ్

కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు
’కాంగ్రెస్ డైరెక్షన్.. బీఆర్ఎస్ యాక్షన్ మూవీ.. రక్త కన్నీరు-2’ అని ఎద్దేవా
బీఆర్ఎస్ కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనం నీళ్లపాలు
కాళేశ్వరాన్ని కాంగ్రెస్ కోమాలోకి నెట్టింది

హైదరాబాద్ వెలుతురు జూలై 12:

బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసిందని, మరోవైపు  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) నివేదికలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ప్రాజెక్టును కోమాలోకి నెట్టిందని అన్నారు. ఈ రెండు పార్టీల తప్పిదాల వల్ల తెలంగాణ రైతులే నష్టపోతున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు. ’కాంగ్రెస్ డైరెక్షన్.. బీఆర్ఎస్ యాక్షన్ మూవీ.. రక్త కన్నీరు-2’ అని ఎద్దేవా చేశారు.

డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారం బ్యారేజీల యజమాని తెలంగాణ ప్రభుత్వమేనని, ఎన్‌డీఎస్ఏ, సీడబ్ల్యూసీ కమిటీలు కేవలం సలహాలు మాత్రమే ఇస్తాయని గుర్తు చేశారు. బ్యారేజీల మరమ్మతులు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.  బీఆర్ఎస్ కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని నీళ్ల పాల్జేసిందని ఆరోపించారు.

ఎన్‌డీఎస్ఏ ఇప్పటికే మూడు సార్లు నివేదికలు ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పునరుద్ధరణ పనులు చేపట్టాలని పదేపదే సూచించినా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసిందని నిలదీశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని గతంలో కాంగ్రెస్ ఆరోపించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం రూ.9 వేల కోట్ల అవినీతి విచారణకే పరిమితమైందని విమర్శించారు. విజిలెన్స్ నివేదిక వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఆ నివేదికను బహిర్గతం చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.

కాళేశ్వరం మరమ్మతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు జాప్యం చేసిందని, ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు బాధ్యతను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల అవినీతి, నిర్లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల గోదావరి జలాలను తెలంగాణ ప్రజలు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

ఇప్పటికైనా రాజకీయాలు పక్కనపెట్టి ఎన్‌డీఎస్ఏ సిఫార్సులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ గురికాక తప్పదని బండి సంజయ్ హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.