బెంగళూరు శివార్లలోని తవరేకెర-మాదపట్టణ పరిధిలోని ఒక రాతి క్వారీలో జరిగిన ఘోర దురంతం యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎగువ క్వారీలో యంత్రాలతో బండరాళ్లను తరలిస్తుండగా, ఒక భారీ బండరాయి దొర్లి దిగువ క్వారీలో పనిచేస్తున్న కార్మికులపై పడింది. ఏడుగురు వలస కార్మికులు అక్కడికక్కడే నలిగి ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు, నలుగురు అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. బతుకుదెరువు కోసం బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించిన నిరుపేదలు, ఉపాధి కోసం వచ్చిన నేలపైనే శవాలుగా మిగిలిపోయారు. ఇది కేవలం ఒక పారిశ్రామిక ప్రమాదం కాదు. లాభాలను మానవ ప్రాణాల కంటే గొప్పగా భావించే ఆర్థిక విధానం, చట్టాలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వ యంత్రాంగం, శ్రామికుల పట్ల కొనసాగుతున్న సామాజిక ఉదాసీనత కలిసి సృష్టించిన వ్యవస్థాగత విషాదం.
ఈ దురంతాన్ని పరిశీలిస్తే ఐదు ప్రధాన అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవి: మొదటిది, లాభమే ఉత్పత్తి ప్రక్రియకు ప్రధాన లక్ష్యంగా మారినప్పుడు శ్రామికుడి భద్రత, ఆరోగ్యం, సంక్షేమం అన్నీ రెండో స్థానానికి వెళ్లిపోతాయి. భద్రతా ప్రమాణాలను పాటించడం ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతుందనే కారణంతో అనేక యాజమాన్యాలు వాటిని నిర్లక్ష్యం చేస్తుంటాయి. బెంగళూరు క్వారీ దురంతం కూడా అదే వాస్తవాన్ని బహిర్గతం చేసింది. కార్మికులకు హెల్మెట్లు, రక్షణ తాళ్లు, ప్రమాద హెచ్చరిక వ్యవస్థలు వంటి కనీస భద్రతా సౌకర్యాలు కూడా కల్పించకపోవడం దీనికి నిదర్శనం.
ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కోట్ల రూపాయలు వెచ్చించే యాజమాన్యాలు, శ్రామికుల ప్రాణాలను కాపాడే కనీస ఏర్పాట్లను మాత్రం అదనపు ఖర్చుగా చూస్తున్నాయి. ఫలితంగా ప్రమాదాలను నివారించే చర్యల కంటే, ప్రమాదం జరిగిన తర్వాత పరిహారం ప్రకటించడం పాలకులకూ, యాజమాన్యాలకూ అలవాటుగా మారింది. ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, లాభాలనే కేంద్రంగా చేసుకున్న ఆర్థిక వ్యవస్థలో శ్రామికుడి ప్రాణం కంటే మూలధన విస్తరణకే అధిక ప్రాధాన్యం లభిస్తోంది.
రెండవది, రక్షణ సిబ్బంది వెల్లడించిన వివరాలు అక్కడి పని పరిస్థితుల క్రూరత్వాన్ని బయటపెట్టాయి. ఎగువ క్వారీలో యంత్రాలతో బండరాళ్లు తరలిస్తుండగా, దిగువన పనిచేస్తున్న కార్మికులను ముందుగా హెచ్చరించే కనీస సమాచార వ్యవస్థ కూడా అక్కడ లేదు. ఒకే సర్వే నంబరులో ఐదేళ్లుగా పక్కపక్కనే నడుస్తున్న రెండు క్వారీల యజమానుల మధ్య కనీస సమన్వయం లేకపోవడం వల్లనే ఎగువ నుంచి దొర్లిన బండరాయి దిగువన పనిచేస్తున్నవారిపై పడింది. ఉత్పత్తి ఆగకూడదనే ఉద్దేశంతో, ఇలాంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా పనులు కొనసాగించారు.
ఇది ఒక్క యాజమాన్యం నిర్లక్ష్యానికి మాత్రమే పరిమితమైన విషయం కాదు. దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికుల వాస్తవ జీవన పరిస్థితులకు ఇది ప్రతిబింబం. వీరిలో చాలామందికి నియామక పత్రాలు ఉండవు. ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత, సామాజిక రక్షణ, ఉద్యోగ హామీ వంటి హక్కులు అందుబాటులో ఉండవు. నివాసానికి తగిన వసతి లేక, దుమ్ము, శబ్ద కాలుష్యం మధ్య తాత్కాలిక షెడ్లలోనే జీవించాల్సి వస్తోంది. ఉత్పత్తి ప్రక్రియలో అత్యంత ప్రమాదకరమైన పనులను వీరితో చేయించుకుంటూనే, వారి జీవన ప్రమాణాలపై యాజమాన్యాలు ఎలాంటి బాధ్యత తీసుకోవడం లేదు.
ఈ పరిస్థితుల్లో శ్రామికుడి ఆరోగ్యం, శారీరక సామర్థ్యం, పని చేసే కాలం అన్నీ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే లెక్కల్లో భాగంగా మారిపోతాయి. ఒక కార్మికుడు గాయపడినా, మరణించినా, అతని స్థానంలో మరో నిరుపేదను తీసుకురావచ్చనే అమానవీయ దృక్పథం దోపిడీని మరింత క్రూరంగా మారుస్తోంది. అందువల్ల ఆధునిక పరిశ్రమల్లో బానిసత్వం పాత రూపంలో కనిపించకపోయినా, ఆర్థిక బలహీనత, ఉద్యోగ అస్థిరత, ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోవడం ద్వారా శ్రామికుడిని ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయడానికి బలవంతం చేసే కొత్త రూపాన్ని సంతరించుకుంది.
ఈ బానిసత్వానికి భారతదేశంలో ఒక చారిత్రక మూలం కూడా ఉంది. ఇక్కడ శూద్ర వర్ణంలో, భూస్వామ్యం చేతిలో ఉన్న కొద్దిమంది అగ్రకుల భూస్వాములను మినహాయిస్తే, మిగిలిన అతిశూద్ర కులాల శ్రమకు చరిత్రలో ఎన్నడూ సరైన విలువ దక్కలేదు. దీన్నే వెట్టి శ్రమ అని పిలిచేవారు. ఆనాటి వెట్టి విధానంలో ఎలాగైతే శూద్రుల శ్రమకు వెలకట్టకుండా వాడుకున్నారో, నేటి పారిశ్రామిక, క్వారీ యాజమాన్యాలు కూడా అదే చారిత్రక ధోరణిని కొత్త రూపంలో అమలు చేస్తున్నాయి. శూద్రుల శ్రమకు నిన్నటికీ నేటికీ విలువ లేకపోవడం యాదృచ్ఛికం కాదు, అది ఒక చారిత్రక కొనసాగింపు.
మూడవది, ఏ పారిశ్రామిక ప్రమాదాన్నీ కేవలం యజమాని నిర్లక్ష్యంగా మాత్రమే చూడలేం. చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వ శాఖలు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించినప్పుడే ఇలాంటి దుర్ఘటనలను ముందుగానే నివారించవచ్చు. కానీ బెంగళూరు క్వారీ విషయంలో అలా జరగలేదు. గనులు–భూగర్భ శాఖ, కార్మిక శాఖ, స్థానిక పరిపాలనా యంత్రాంగం, మైనింగు, పర్యావరణ పరిరక్షణ బోర్డు, అన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వం తమ బాధ్యతలను నిర్వర్తించి ఉంటే ఈ ప్రమాదం ఇంత ఘోర రూపం దాల్చేది కాదు.
స్థానిక ప్రజలు బఫర్ జోన్‌లోనే అనుమతుల్లేకుండా క్వారీయింగ్ కొనసాగుతోందని పలుమార్లు ఫిర్యాదులు చేశారు. యశ్వంత్‌పూర్ ఎమ్మెల్యే సోమశేఖర్ కూడా ఈ అక్రమాలను శాసనసభలో, పిటిషన్ల కమిటీ ముందు ప్రస్తావించారు, ఈ దురంతం కేవలం నిర్లక్ష్యం కాదని, భూగర్భ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు అక్రమ క్వారీ నిర్వహణకు కొమ్ముకాశారని ఆరోపించారు. అయినప్పటికీ తనిఖీలు, నియంత్రణ చర్యలు, లైసెన్సు నిబంధనల అమలులో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ప్రమాదం జరగకముందే అందిన హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం వల్లనే ఏడుగురు శ్రామికులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంఘటన ఒక ముఖ్యమైన వాస్తవాన్ని గుర్తు చేస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం చట్టాలను అమలు చేయడంలో విఫలమైతే, ఆ నిర్లక్ష్యం యజమానులకు పరోక్ష రక్షణగా మారుతుంది. తనిఖీలు సక్రమంగా జరగకపోవడం, ఫిర్యాదులను పట్టించుకోకపోవడం, నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోకపోవడం వల్ల భద్రతా ప్రమాణాలను విస్మరించే ధోరణి మరింత పెరుగుతోంది. చివరికి మూల్యం చెల్లించేది మాత్రం శ్రామికులే. అందుకే ఇలాంటి దుర్ఘటనలను వ్యక్తిగత తప్పిదాలుగా కాకుండా, పాలనా వైఫల్యంగా కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
ప్రమాదం జరిగిన వెంటనే తవరేకెర పోలీసులు క్వారీ యజమానులు డి. ఆనందస్వామి, ఎస్.ఆర్. ఉదయశంకర్‌తో పాటు మరో ముగ్గురిపై నేర పూరిత నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేశారు. అయితే ఏడాదిలో సంగతి కాదు, ఏడు రోజులు గడిచినా ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలోనే ఉండటం, వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని కనిపించకుండా పోవడం, నిందితులను పట్టుకోవడంలో పోలీసు యంత్రాంగం ఎంత నిదానంగా వ్యవహరిస్తుందో చూపిస్తుంది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, బాధిత కుటుంబాలకు ప్రకటించిన పరిహారం, సహాయం పూర్తిగా అందించాలని ఎమ్మెల్యే సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యజమానులను కాపాడే ప్రయత్నం ఏమాత్రం జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. డబ్బు, పలుకుబడి ఉన్నవారు ప్రాణనష్టం జరిగిన తర్వాత కూడా ఎంత సునాయాసంగా చట్టం నుంచి తప్పించుకోగలరో ఈ పరారీయే నిదర్శనం.
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో కాలుష్యకారక పరిశ్రమలపై రైతులు ఏళ్ల తరబడి ఫిర్యాదులు చేస్తున్నా, ప్రధాన మంత్రి కార్యాలయం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, హైకోర్టు, పార్లమెంటు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోకపోవడం ఇదే ధోరణికి మరో నిదర్శనం. ఇలాంటి ప్రాణాంతక పరిశ్రమలను నియంత్రించాల్సిన శాఖలు యజమానుల పక్షాన నిలబడటం వెనుక, పెట్టుబడిదారీ వర్గాల మెప్పు పొందడం, పెట్టుబడులను ఆకర్షించడం అనే అభివృద్ధి లక్ష్యమే కారణంగా కనిపిస్తుంది. యజమానుల పక్షాన ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయి, ప్రజల ప్రాణాలు తీసిన పరిశ్రమలను కట్టడి చేయడంలో మాత్రం ఏళ్ల తరబడి తాత్సారమే మిగులుతుంది.
ఇక్కడ మరో ముఖ్యమైన వైరుధ్యాన్ని కూడా గమనించాలి. నేడు ప్రభుత్వం చాలా వ్యవహారాలను పేపర్‌లెస్, ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నామని చెబుతున్నా, కార్మికుల భద్రతకు సంబంధించిన ఫిర్యాదులు, చర్యల విషయంలో మాత్రం అధికార యంత్రాంగం ఆ విధానాన్ని అందిపుచ్చుకోవడం లేదు. ఏదైనా ఫిర్యాదుపై చర్య తీసుకోవాల్సిన ఆదేశం వచ్చినా, దాన్ని చేతిరాతతో లేదా పోస్టు ద్వారా చేరవేస్తున్నారు, దీనివల్ల తక్షణమే అమలులోకి రావాల్సిన ఆదేశం రోజుల తరబడి ఆలస్యంగా చేరుతుంది. ఈ ఆలస్యంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది, యాజమాన్యాలకు కోట్ల రూపాయల లాభం చేకూరుతుంది. అంటే, పరిపాలనా వేగం ఎక్కడ అవసరమో అక్కడ మందగించడం, ఎక్కడ మందగించాలో అక్కడ యజమానుల అనుకూలంగా వేగంగా కదలడం, ఇదే అసలు వైరుధ్యం.
నాలుగవది, ఈ ప్రమాదంలో మరణించిన వారంతా బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, యాద్గిర్ నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన కార్మికులు. ఇది యాదృచ్ఛికం కాదు. ప్రాంతాల మధ్య అభివృద్ధిలో ఉన్న అసమానతలు, వ్యవసాయ సంక్షోభం, గ్రామీణ నిరుద్యోగం, భూమిలేని కుటుంబాల పెరుగుదల లక్షలాది మందిని స్వస్థలాలు విడిచి వలస వెళ్లే పరిస్థితికి నెడుతున్నాయి. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఉపాధి సంపాదించినా, భద్రత మాత్రం వారికి అందని హక్కుగానే మిగులుతోంది.
వలస కార్మికులు అధికంగా అసంఘటిత రంగంలోనే పనిచేస్తారు. శాశ్వత ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ, ప్రమాద బీమా, ఆరోగ్య సౌకర్యాలు, కార్మిక సంఘాల అండ వంటి హక్కులు వారికి చాలా సందర్భాల్లో అందుబాటులో ఉండవు. స్థానిక భాష తెలియకపోవడం, చట్టాలపై అవగాహన లేకపోవడం, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి పరిస్థితులను యాజమాన్యాలు తమకు అనుకూలంగా మలుచుకుంటాయి. ఫలితంగా అత్యంత ప్రమాదకరమైన పనులను అత్యల్ప వేతనాలకు చేయించుకునే పరిస్థితి ఏర్పడుతోంది.
ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల నుంచి నిరంతరం వలస వచ్చే ఈ శ్రమశక్తి యజమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉండడం వల్ల, ఒక కార్మికుడి ప్రాణానికి విలువ తగ్గిపోతుంది. గాయపడిన లేదా మరణించిన వారి స్థానంలో మరొకరిని తీసుకొచ్చే అమానవీయ దృక్పథం బలపడుతోంది. ఇదే కారణంగా అనేక పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల కంటే ఉత్పత్తి నిరంతరతకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
మన దేశ సమాజంలో ఈ పరిస్థితిని మరో కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. అసంఘటిత రంగంలోని అత్యంత ప్రమాదకరమైన శారీరక శ్రమలో పనిచేసేవారిలో అధికశాతం మంది దళిత, బహుజన, ఆదివాసీ వర్గాలకు చెందినవారే. ఇది యాదృచ్ఛికం కాదు. చారిత్రకంగా ఆర్థిక ఆధిపత్యం, సామాజిక ఆధిపత్యం పరస్పరం బలపరుచుకుంటూ వచ్చాయి. అందువల్ల ప్రమాదకర శ్రమలో అధికంగా దళిత, బహుజన, ఆదివాసీలు ఉండగా, మూలధన యాజమాన్యంలో అగ్రవర్గాల ప్రాబల్యం కొనసాగుతోంది. ఈ కారణంగా వర్గ దోపిడీ, కుల ఆధారిత శ్రమ విభజన ఒకదానికొకటి బలాన్నిస్తూ అసమానతలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.
ఐదవది, ప్రతి పారిశ్రామిక ప్రమాదం తర్వాత ప్రభుత్వాలు దాదాపు ఒకే విధమైన చర్యలను పునరావృతం చేస్తుంటాయి. విచారణ కమిటీలు వేయడం, కొద్ది రోజులపాటు పరిశ్రమలను మూసివేయడం, కొందరు అధికారులను బదిలీ చేయడం, నోటీసులు జారీ చేయడం, మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించడం, ఇవన్నీ ప్రమాదం జరిగిన వెంటనే కనిపించే చర్యలు. కొద్ది రోజుల పాటు ఇవి వార్తల్లో నిలుస్తాయి. ప్రజల్లో చెలరేగిన ఆగ్రహం చల్లారిన తర్వాత మాత్రం పరిస్థితి మళ్లీ యథాతథంగా మారిపోతుంది.
దీనికి కారణం ప్రమాదాన్ని ఒక వ్యక్తి తప్పిదంగా చూడడమే తప్ప, లాభాల కోసం భద్రతను త్యాగం చేసే ఉత్పత్తి విధానంలో అంతర్లీనంగా ఉన్న వైరుధ్యంగా చూడకపోవడమే. భద్రతా ప్రమాణాలను అమలు చేయడం కంటే, ప్రమాదం జరిగిన తర్వాత పరిహారం చెల్లించడం చౌకగా ఉంటుందని భావించే దృక్పథం యాజమాన్యాల్లో బలపడుతోంది.
బెంగళూరు క్వారీ దురంతం ఇది కర్ణాటకకు మాత్రమే పరిమితమైన సమస్య కాదని చూపిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా దేశవ్యాప్తంగా ఇదే నిర్లక్ష్యం అనేక రూపాల్లో కనిపిస్తోంది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పెరియపాళయం సమీపంలోని ఒక రొయ్యల ప్రాసెసింగ్, ఎగుమతి కేంద్రంలో జూన్ 2026లో అమ్మోనియా వాయువు లీకై, మొదట ఏడుగురు మరణించారని వార్తలు వచ్చినా, రోజులు గడిచేకొద్దీ మృతుల సంఖ్య పదిహేడుకు చేరింది, ఎనభై మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళా కార్మికులే, వీరంతా ఒడిశా, అస్సాం, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారు. అత్యవసర సమయాల్లో స్పందించే ముందస్తు రక్షణ ఏర్పాట్లు లేకపోవడం, లాభాల కోసమే తప్ప శ్రామికుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే ఈ ఘోరం జరిగింది. దీనికి తోడు, మధ్యవర్తులుగా వ్యవహరించే దళారీ కాంట్రాక్టర్లు కార్మికులను కేవలం ఒక చౌక శ్రమశక్తిగా చూస్తూ, వారి అధికారిక రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, వలస కూలీలకు తమ హక్కులపై కనీస అవగాహన కల్పించకపోవడం వల్ల ఈ వ్యవస్థాగత దోపిడీ నిరంతరాయంగా సాగుతోంది. ప్రభుత్వ కార్మిక శాఖల తనిఖీలలో ఉదాసీనత, అంతరాష్ట్ర సమన్వయ లోపం, కాంట్రాక్టర్ల అక్రమ రిక్రూట్‌మెంట్ విధానాల వల్లనే ఇటువంటి ప్రమాదాలు పునరావృతమవుతూ వలస జీవుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లాలోని సిగాచి రసాయన కర్మాగారంలో 2025 జూన్‌లో జరిగిన పేలుడులో యాభైకి పైగా కార్మికులు మరణించారు. మరణించిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినా, ఏడాది గడిచినా సగటున కేవలం నలభై ఐదు లక్షలే చెల్లించారు, శాశ్వత వైకల్యం పొందిన వారికి పది లక్షలు, గాయపడిన వారికి ఐదు లక్షలు మాత్రమే నిర్ణయించారు. ఇది కేవలం జాప్యం కాదు, ప్రకటించిన మాటనే తుంగలో తొక్కి బాధిత కుటుంబాలను న్యాయస్థానాల చుట్టూ తిప్పే పాలనా నిర్లక్ష్యం.
నల్లగొండ జిల్లాలో శ్రీశైలం అనుసంధాన కాలువ సొరంగం 2025 ఫిబ్రవరిలో కుప్పకూలి ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఏడాది గడిచినా వారిలో పలువురి మృతదేహాలు వెలికితీయలేకపోవడం ప్రణాళికా లోపాలను, భద్రతా వైఫల్యాలను బహిర్గతం చేసింది. ఈ ప్రమాదానికి ఏ ఒక్క ప్రభుత్వాన్ని మాత్రమే కారణంగా చూపి తప్పించుకోలేం. ఏళ్ల తరబడి ఈ ప్రాజెక్టుకు తగినన్ని నిధులు కేటాయించకుండా, యంత్రాలను నిర్వహణ లేకుండా వదిలేసి పనులను స్తంభింపజేసిన నిర్లక్ష్యం ఒక వైపు ఉంటే, తర్వాత పనులు తిరిగి మొదలుపెట్టేటప్పుడు తగిన భూగర్భ అధ్యయనాలు, భద్రతా ముందు జాగ్రత్తలు తీసుకోకుండా హడావుడిగా ముందుకు పోవడం మరో వైపు కారణమైంది. అంటే అధికారంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ప్రజల ప్రాణాల కంటే ప్రాజెక్టు రాజకీయ ప్రయోజనమే ముఖ్యమైందన్నది స్పష్టం. సొరంగంలో పనిచేస్తున్న కార్మికుల్లో అత్యధికులు బీహార్ వంటి తెలంగాణేతర రాష్ట్రాల నుంచి వచ్చినవారే, వీరికి కాంట్రాక్టు కంపెనీ రోజుకు కేవలం ఐదారు వందల రూపాయల కూలీ ఇస్తూ, అది కూడా నెలల తరబడి బకాయి పెట్టిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఒక కుటుంబం తన పెద్దదిక్కును కోల్పోయిన కడుపుకోతకు చివరికి ఎవరు జవాబుదారీ వహిస్తారు, లాభాలు జేబులో వేసుకున్న కాంట్రాక్టు సంస్థా, లేక ప్రాజెక్టును సరిగ్గా నిర్వహించని, కార్మికుల భద్రతను పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగమా అన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది.
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల సంఘం స్వయంగా జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరాల్సి రావడం కూడా పని ప్రదేశాల భద్రత ఎంత నిర్లక్ష్యానికి గురవుతోందో తెలియజేస్తోంది. ఇవి వేర్వేరు రాష్ట్రాల్లో జరిగిన విడివిడిగా ఉన్న సంఘటనలు కావు. భద్రత కంటే ఉత్పత్తికి, ఉత్పత్తి కంటే లాభాలకు ప్రాధాన్యం ఇచ్చే ఒకే విధమైన అభివృద్ధి నమూనా ఫలితాలు. అందుకే ప్రదేశాలు మారుతున్నాయి, ప్రమాదాల స్వరూపం మారుతోంది, కానీ బలవుతున్నవారు మాత్రం శ్రామికులే.
మన దేశంలో కార్మిక ఉద్యమం వెల్లడిస్తున్న గణాంకాల ప్రకారం, పని ప్రదేశాల్లో జరిగే ప్రమాదాల్లో గణనీయమైన వాటా అధికారిక రికార్డుల్లోనే నమోదుకావడం లేదు. వేలాది కార్మికులు ప్రాణాలు కోల్పోయినా, అనేక సంఘటనలు గణాంకాల్లోకి కూడా రావడం లేదు. ప్రమాదాలను సక్రమంగా నమోదు చేయకపోవడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం, కార్మిక భద్రత కంటే ఉత్పత్తి నిరంతరతకే ప్రాధాన్యం ఇవ్వడం వంటి ధోరణులు ఈ విషాదాలను మరింత పెంచుతున్నాయి. ఇటీవలి చట్ట సవరణలపై కూడా కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, యజమానుల బాధ్యతను తగ్గించే విధానాలు, కాంట్రాక్టు-ఔట్‌సోర్సింగ్ విధానాల విస్తరణ, శిక్షణ లేని కార్మికులను ప్రమాదకర విభాగాల్లో నియమించడం వంటి చర్యలు ప్రమాదాల అవకాశాలను మరింత పెంచుతున్నాయి. మరోవైపు, ప్రతి ప్రమాదం తర్వాత కార్మికుల నిర్లక్ష్యాన్నే కారణంగా చూపిస్తూ యాజమాన్యాలు బాధ్యత నుంచి తప్పించుకోవడం సాధారణమైపోయింది.
అంతేకాదు, ప్రతి మరణానికి ప్రకటించే పరిహారం కూడా సమస్యకు పరిష్కారం కాదు. ఒక కుటుంబం తన ఆధారాన్ని కోల్పోయిన విషాదాన్ని డబ్బుతో భర్తీ చేయలేము. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు ప్రకటించడం కంటే, ప్రమాదం జరగకుండా నిరోధించే భద్రతా వ్యవస్థలను నిర్మించడం ప్రభుత్వాల, యాజమాన్యాల మొదటి బాధ్యత కావాలి. శ్రామికుడి ప్రాణానికి ధర కట్టే సంస్కృతి ఎంత త్వరగా ముగుస్తే, అంత త్వరగా ఇటువంటి దుర్ఘటనలు తగ్గుతాయి.
అందువల్ల పరిష్కారం కేవలం పరిహారం, విచారణ కమిటీలు, నోటీసులతో ముగిసిపోకూడదు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించి కార్మికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు విధించాలి. పరారీలో ఉన్న నిందితులను వేగంగా పట్టుకునే బాధ్యతను పోలీసు యంత్రాంగం సీరియస్‌గా తీసుకోవాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులను కూడా సమానంగా బాధ్యులుగా పరిగణించాలి. ప్రతి ప్రమాదకర పరిశ్రమలో కార్మికుల భాగస్వామ్యంతో స్వతంత్ర భద్రతా కమిటీలను ఏర్పాటు చేయాలి. వలస కార్మికుల నమోదు, సామాజిక భద్రత, ప్రమాద బీమా, గౌరవప్రదమైన నివాస సౌకర్యం, ఆరోగ్య రక్షణ వంటి అంశాలను చట్టబద్ధమైన హక్కులుగా అమలు చేయాలి. భద్రతా తనిఖీలను పారదర్శకంగా నిర్వహించి వాటి నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
బెంగళూరు క్వారీ దురంతం మనకు మరోసారి ఒక చేదు సత్యాన్ని గుర్తు చేసింది. లాభమే ఉత్పత్తి లక్ష్యంగా, శ్రామికుడు కేవలం ఖర్చులోని ఒక అంకెగా మిగిలినంతకాలం ఇలాంటి దుర్ఘటనలు ఆగవు. శ్రామికుడి ప్రాణం, గౌరవం, భద్రత ఉత్పత్తి ప్రక్రియకు కేంద్రంగా నిలిచినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే ఈ విషాదాన్ని ఒక్క క్వారీ ప్రమాదంగా కాకుండా, శ్రమను చౌక వస్తువుగా చూసే అభివృద్ధి నమూనాపై తీవ్రమైన హెచ్చరికగా చూడాలి.
నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలు, వారికి సహకరించే అధికార యంత్రాంగం, శ్రామికుల భద్రతను నిర్లక్ష్యం చేసే విధానాలు, ఇవన్నీ మారకపోతే బెంగళూరు దుర్ఘటన చివరిది కాదు. ప్రదేశాలు మారవచ్చు, పరిశ్రమలు మారవచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు, కానీ బలయ్యేది మాత్రం అదే శ్రామిక వర్గం. అందుకే కార్మిక లోకం, ప్రజాస్వామ్య శక్తులు, సామాజిక ఉద్యమాలు రాష్ట్రాల సరిహద్దులను దాటి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. శ్రామికుడి ప్రాణం లాభాల కంటే గొప్పదనే విలువ సమాజంలో స్థిరపడినప్పుడే ఇలాంటి వ్యవస్థాగత విషాదాలకు శాశ్వత ముగింపు లభిస్తుంది.

పాపని నాగరాజు
(సత్యశోధక మహాసభ)
