విజయవంతంగా కక్ష్యలోకి చంద్రయాన్-3… ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు

శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ మధ్యాహ్నం నింగికెగిసిన చంద్రయాన్-3 మాడ్యూల్ నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. చంద్రయాన్-3ని గగనానికి మోసుకెళ్లిన ఎల్వీమ్3-ఎం4 రాకెట్ అన్ని దశలు సాఫీగా పూర్తి చేసింది. అనుకున్న సమయానికే చంద్రయాన్-3ని నిర్దేశిత కక్ష్యలోకి విడుదల చేసింది. ఎల్వీమ్3-ఎం4 రాకెట్ నుంచి చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా విడిపోయింది. దాంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో సంబరాలు మిన్నంటాయి. 

తమ కృషి ఫలించినందుకు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ చంద్రయాన్-3ని భూకక్ష్యలోకి చేర్చిందని వెల్లడించారు. ఇది క్రమంగా కక్ష్యను విస్తరించుకుంటూ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని వివరించారు. 40 రోజుల ప్రయాణం అనంతరం ఈ చంద్రయాన్-3 లోని ల్యాండర్ జాబిల్లిపై దిగనుందని తెలిపారు. ప్రస్తుతం చంద్రయాన్-3 జాబిల్లి దిశగా వెళుతోందని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.