- 2018 నుంచి ఇప్పటి వరకు విదేశాల్లో 403 మంది భారత విద్యార్థుల మృతి
- ఒక్క కెనడాలోనే 91 మంది మృత్యువాత
- అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన 36 మంది విద్యార్థులు
- లోక్‌సభలో వెల్లడించిన కేంద్రం
ఉన్నత విద్యను అభ్యసించేందుకు అగ్రరాజ్యం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, నెల రోజుల వ్యవధిలో ఏకంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. వీరిలో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మరణించగా, హర్యానా విద్యార్థి ఆశ్రయం కల్పించిన వ్యక్తి చేతిలోనే హత్యకు గురయ్యాడు. తెలుగు విద్యార్థులు ఇద్దరు జనవరి 15న ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించినప్పటికీ గ్యాస్ లీకేజీనే వారి మృతికి కారణమని ఆ తర్వాత తేలింది.
2018 నుంచి ఇప్పటి వరకు విదేశాల్లో చదువుకుంటున్న 403 మంది విద్యార్థులు మరణించారు. అత్యధికంగా కెనడాలో 91 మంది మరణించగా, బ్రిటన్‌లో 48, రష్యాలో 40, అమెరికాలో 36, ఆస్ట్రేలియాలో 35, ఉక్రెయిన్‌లో 21, జర్మనీలో 20 మంది మృతి చెందినట్టు నిన్న లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో సహజ మరణాలతోపాటు ప్రమాదాలు, వైద్య సంబంధిత మరణాలు కూడా ఉన్నట్టు వివరించింది.