ఎల్లుండి కాంగ్రెస్‌లోకి షర్మిల.. మరికాసేపట్లో పార్టీ నేతలతో సమావేశం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 4న కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న షర్మిల కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు.

ఈ ఉదయం 11 గంటలకు షర్మిల తన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై చర్చించనున్నట్టు సమాచారం. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంపై షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. అందుకనే ఆయన మళ్లీ అధికారంలోకి రాకూడదని కోరుకున్నట్టు తెలిపారు. తాను పోటీ చేస్తే 55 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతుందని, అదే జరిగితే తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. కాగా, షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారన్న వార్త ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హీట్ పెంచింది.

Leave A Reply

Your email address will not be published.