ఎవరికి ఎవరు కోవర్టు… ఏ పార్టీ నేతలు రహస్యంగా కలుస్తున్నారో ప్రజలకు తెలుసు: బండి సంజయ్

ఎవరికి ఎవరు కోవర్టు.. ఏ పార్టీ నేతలు మరే పార్టీ నేతలతో రహస్యంగా కలుస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… కొందరు మంత్రుల ముఖ కవళికలు, వాళ్లు వాడుతున్న భాషను చూస్తుంటే అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరును జ్ఞప్తికి తెస్తోందన్నారు. అంటే అక్కడక్కడా బీఆర్ఎస్ వేర్లు కనిపిస్తున్నాయని.. వాటిని కూకటి వేళ్లతో పెకిలించేదాకా విశ్రమించేది లేదన్నారు.

కొందరు మంత్రుల్లో అప్పుడే అహంభావం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్నారు. ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. ఎవరికి ఎవరు కోవర్టులో… ఎవరిని ఎవరు రహస్యంగా కలుస్తున్నారో ప్రజలకు తెలుసునన్నారు. అదృష్టం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తప్ప… ఆ పార్టీ నేతలు చేసిన పోరాటమేమీ లేదన్నారు. అసలు కాంగ్రెస్ ఎవరి కోసం పోరాడింది? నిరుద్యోగులు, రైతులు, మహిళల పక్షాన కొట్లాడారా? అని నిలదీశారు.

రామమందిరం విషయంలో ముస్లిం మతపెద్దలు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారన్నారు. ఫరూక్ అబ్దుల్లా వంటి నేత కూడా శ్రీరాముడు దేశానికే కాదు… ప్రపంచానికే దేవుడు అని కీర్తిస్తున్నాడన్నారు. అసదుద్దీన్ ఒవైసీని ముస్లిం సమాజమే నమ్మడం లేదన్నారు. గోమాతను వధిస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ఫాల్తుగాళ్లను పబ్లిక్‌లో శిక్షించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.