మాల్దీవులతో వివాదం… మధ్యంతర బడ్జెట్‌లో ‘లక్షద్వీప్‌’పై నిర్మలా సీతారామన్ దృష్టి

  • పర్యాటకరంగంలో కేంద్ర ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులు పెట్టనుందన్న నిర్మలా సీతారామన్
  • లక్షద్వీప్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కృషి చేస్తామన్న కేంద్రమంత్రి
  • దేశీయంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తామన్న నిర్మలమ్మ

దేశంలో పర్యాటకరంగంలో కేంద్ర ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులు పెట్టనుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు తన మధ్యంతర బడ్జెట్ 2024 ప్రసంగంలో తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో పర్యాటక రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

భారతీయులు పెద్ద సంఖ్యలో వెళ్లే ద్వీపసమూహ దేశమైన మాల్దీవులతో దౌత్యపరమైన వివాదం తర్వాత చాలామంది భారతీయులు లక్షద్వీప్‌ను ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా చూస్తున్నారు. ఈ క్రమంలో మధ్యంతర బడ్జెట్‌లో పర్యాటక రంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు లక్షద్వీప్‌లో మౌలిక వసతులపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ ద్వీపానికి భారీగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు.

బడ్జెట్ ప్రసంగం సమయంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… పర్యాటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని, భారత్‌లో 60 చోట్ల నిర్వహించిన జీ20 సమావేశాలు ఇక్కడి వైవిధ్యాన్ని ప్రపంచ పర్యాటకులకు తెలియజేశాయన్నారు. మన ఆర్థిక శక్తితో దేశాన్ని వ్యాపారాలకు కేంద్రంగా చేయడంతోపాటు టూరిజాన్ని ఆకర్షించాలన్నారు. మన మధ్య తరగతి కుటుంబాలు ఇప్పుడు కొత్త ప్రాంతాల అన్వేషణకు ఉత్సాహంగా ఉన్నాయన్నారు. ఆధ్యాత్మిక పర్యటనలతోనూ వ్యాపారాలకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయన్నారు. పర్యాటక రంగానికి సంబంధించి రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. వాటిని ప్రపంచస్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ చేస్తామన్నారు.

మన వద్ద మౌలిక సదుపాయాలు, నాణ్యమైన సేవల ఆధారంగా పర్యాటక కేంద్రాలకు రేటింగ్ ఇచ్చేలా ఫ్రేమ్ వర్క్‌ను సిద్ధం చేస్తామన్నారు. పర్యాటక రంగాల అభివృద్ధికి ఫైనాన్సింగ్ సమకూరుస్తామని వెల్లడించారు. లక్షద్వీప్ వంటి పర్యాటక ప్రాంతాలకు పోర్ట్ కనెక్టివిటీ, టూరిజం ఇన్ఫ్రా, ఇతర మౌలిక వసతులు ఉండేలా చూస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.