పర్యాటక అభివృద్ధికి సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

  • రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, ప్రమోషన్ పై దృష్టి సారించాలి
  • పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రత, నిర్వహణ, మెరుగైన సేవలకు ప్రాధాన్యం
  • పెట్టుబడులను ఆకర్షించేలా పీపీపీ, లీజ్ విధానాల్లో ప్రతిపాదనలు రూపొందించాలి
  • హెరిటేజ్ వాక్‌లు, ఉత్సవాలు, కళలు, వంటకాలకు విస్తృత ప్రచారం కల్పించాలి
  • అంతర్జాతీయ స్థాయి హైదరాబాద్ కార్నివాల్ నిర్వహణపై అధ్యయనం చేయాలి

హైదరాబాద్, వెలుతురు జూలై 7:

తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు మౌలిక వసతుల కల్పన, సమర్థ నిర్వహణతో పాటు విస్తృత ప్రచారం, మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పర్యాటక ప్రాంతాలు, కొత్తగా అభివృద్ధి చేసేందుకు అవకాశమున్న ప్రదేశాలను గుర్తించి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. పర్యాటకుల సంఖ్యను పెంచడంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా స్థిరమైన నమూనాలను రూపొందించాలని స్పష్టం చేశారు.

పర్యాటక అభివృద్ధి, ప్రమోషన్, మౌలిక వసతుల కల్పన, పర్యాటక ప్రాంతాల నిర్వహణ, పెట్టుబడుల ఆకర్షణ, హెరిటేజ్ వాక్‌లు, ఉత్సవాలు, హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి కార్నివాల్ నిర్వహణ, తదితర అంశాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక సలహా మండలి సభ్యులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

మూస పద్ధతులకు స్వస్తి పలికి వినూత్నమైన, ఆచరణ సాధ్యమైన, నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. కొత్త పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న గమ్యస్థానాల బలోపేతం, వినూత్న పర్యాటక అనుభూతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల సృష్టి ద్వారా తెలంగాణను దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా నిలపడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పర్యాటక సలహా మండలి సభ్యులు.. పర్యాటక అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలు, సూచనలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

జిల్లా స్థాయిలో పర్యాటక వ్యవస్థను బలోపేతం చేయాలి

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యాటక కార్యకలాపాల పర్యవేక్షణ, సమన్వయానికి సమర్థమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పర్యాటక అధికారులను నియమించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. పర్యాటక శాఖ, పర్యాటక అభివృద్ధి సంస్థ మధ్య సమన్వయం పెంచడంతో పాటు క్షేత్రస్థాయిలో బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించాలన్నారు. అధికారులకు అవసరమైన అధికారాలను అప్పగించి, నిరంతర పర్యవేక్షణ, ఫీడ్‌బ్యాక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

పర్యాటక ప్రాంతాల్లో రోజువారీ నిర్వహణ అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చేశారు. మరుగుదొడ్లు, తాగునీరు, ఆహారం, పరిశుభ్రత, ఇతర సేవల నిర్వహణలో లోపాలకు తావులేకుండా చూడాలన్నారు. ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ వ్యవస్థను బలోపేతం చేసి, పర్యాటక ప్రాంతాల పరిరక్షణ, నిర్వహణకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తొలిదశలో కొన్ని ప్రాంతాలను గుర్తించి తాత్కాలిక కాటేజీల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

పెట్టుబడులకు అనువైన ప్రాంతాలను గుర్తించాలి

పర్యాటక రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు అవకాశమున్న ప్రాంతాలను గుర్తించడానికి ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. పీపీపీ, లీజ్ విధానాల్లో ప్రాజెక్టుల అభివృద్ధికి అనువైన స్థలాలను గుర్తించి జాబితా రూపొందించాలన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వెలుపల పర్యాటక పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు.

పర్యాటక రంగంలో కొత్త ఆలోచనలు, వినూత్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వింటేజ్ కార్ల ప్రదర్శన కేంద్రం, స్కల్ప్చర్ వ్యాలీ, స్టోన్ స్కల్ప్చర్ విలేజ్, మెటల్ కాస్టింగ్ స్కల్ప్చర్ విలేజ్, గ్రాఫిటీ విలేజ్, హాలిడే విలేజ్, థీమ్ రిసార్టులు వంటి ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని పేర్కొన్నారు.

హెరిటేజ్ వాక్‌లను విస్తరించాలి

హైదరాబాద్‌లోని చార్మినార్, కోఠి, పుత్లీబౌలి, లాడ్‌బజార్ తదితర ప్రాంతాల్లో హెరిటేజ్, కల్చరల్ వాక్‌లను మరింత విస్తృతంగా నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. పర్యటన ప్యాకేజీల రూపకల్పన, శిక్షణ పొందిన గైడ్‌ల ఏర్పాటు, పాతబస్తీ, కొత్త నగరంలోని పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ ఆర్టీసీ సహకారంతో షటిల్ బస్సు సర్వీసుల నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.

బోనాలు, బతుకమ్మతో పాటు తెలంగాణ కళలు, నృత్యాలు, సంగీతం, వంటకాలు, వారసత్వ సంపదను పర్యాటక ప్రమోషన్‌లో భాగం చేయాలని సూచించారు. తారామతి బారాదరిలో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, టికెటింగ్, మరుగుదొడ్లు, ఇతర సేవలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సమాచారం పర్యాటకులకు సులభంగా అందుబాటులో ఉండేలా సమగ్ర వెబ్‌సైట్, బ్రోచర్లు, ఇతర ప్రచార సాధనాలను రూపొందించాలని సూచించారు.

అంతర్జాతీయ కార్నివాల్ నిర్వహణ అవకాశాలపై అధ్యయనం

హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి కార్నివాల్ నిర్వహించే అవకాశాలపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ వారసత్వం, కళలు, హస్తకళలు, వంటకాలు, చెరువులు, సంస్కృతి, ఆధునిక ఆవిష్కరణలకు ప్రాధాన్యం కల్పిస్తూ కార్నివాల్ నిర్వహణకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలను పర్యాటక సలహా మండలి సభ్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ప్రపంచ ప్రసిద్ధ కార్నివాల్‌లను అధ్యయనం చేసి తెలంగాణ ప్రత్యేకతను ప్రతిబింబించేలా హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి కార్నివాల్ నిర్వహణకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. ప్రతిపాదనలను సమగ్రంగా అధ్యయనం చేసి, సాధ్యాసాధ్యాలు, నిర్వహణ విధానం, భాగస్వామ్య సంస్థలు, అవసరమైన మౌలిక వసతులు తదితర అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు.

సోమశిలలో పర్యాటక అవకాశాలను అన్వేషించాలి

సోమశిలలోని దాదాపు 1,600 ఎకరాల భూమిని సమర్థంగా వినియోగించుకునేందుకు సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సోమశిల పరిసరాల్లోని ఆలయ సముదాయం, కృష్ణా నది బ్యాక్‌వాటర్స్, అందుబాటులో ఉన్న భూములను పరిగణనలోకి తీసుకొని పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. స్టార్ హోటళ్లు, వెడ్డింగ్ డెస్టినేషన్లు, వాటర్ స్పోర్ట్స్, గోల్ఫ్ కోర్సు తదితర ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.

పాలంపేట, సోమశిలతో పాటు అనువైన ఇతర పర్యాటక ప్రాంతాల్లో హోమ్‌స్టేల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లతో సహా రాష్ట్రంలోని ప్రకృతి, అటవీ పర్యాటక ప్రాంతాలకు ఆశించిన స్థాయిలో పర్యాటకులు ఎందుకు రావడం లేదో విశ్లేషించాలని సూచించారు. ప్రచారం, రవాణా, వసతి, సేవల్లో ఉన్న లోపాలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.

పర్యాటకులకు మెరుగైన సేవలు, అనుభూతులను అందించేందుకు టూరిస్ట్ గైడ్ల ఎంపిక, వృత్తిపరమైన శిక్షణకు పటిష్ఠమైన వ్యవస్థను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, పర్యాటక సలహా మండలి సభ్యులు పాపారావు, రాందేవ్ రావు, బాలాజీ, జుల్ఫికర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.