- కాళేశ్వరం పేరుతో భారీ అవినీతి జరిగిందన్న టీపీసీసీ చీఫ్
- ఇంజినీర్ల సూచనలు పట్టించుకోకే ప్రాజెక్టు దెబ్బతిందని విమర్శ
- ఎన్‌డీఎస్‌ఏ అనుమతులు లేకుండా నీటి నిల్వ ప్రమాదకరమని హెచ్చరిక
- కాళేశ్వరం పునరుద్ధరణకు కాంగ్రెస్ చర్యలు చేపడుతుందని వెల్లడి
హైదరాబాద్ వెలుతురు జూలై 07:
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాళేశ్వరం పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఇంజినీర్ల సూచనలను పట్టించుకోకుండా కేసీఆర్ వ్యవహరించడంతో కాళేశ్వరం ప్రాజెక్టు “కూళేశ్వరం”గా మారిందని విమర్శించారు.
కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని, ఇంజినీర్లను పక్కనపెట్టి తానే ఇంజినీర్‌నని భావిస్తూ కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం వల్ల ప్రాజెక్టు నాణ్యత దెబ్బతిందన్నారు. ఇప్పుడు వారం రోజుల్లో నీళ్లు ఇస్తామని చెబుతున్న కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి కారణంగానే ప్రాజెక్టు మనుగడకే ముప్పు ఏర్పడిందన్నారు. వర్షాభావం ఉన్న సమయంలో సముద్రంలోకి నీటిని వదులుతున్నారంటూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన అనుభవరాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతితో కాళేశ్వరాన్ని దెబ్బతీస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల నాణ్యతపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తమయ్యాయని, ఈ విషయం కేటీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. నాణ్యతా లోపాలున్న ప్రాజెక్టులో పంపులను ప్రారంభిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలుసుకోవాలని సూచించారు. గతంలో కేసీఆర్ తాను ఇంజినీర్‌నంటూ గొప్పలు చెప్పుకుని ప్రాజెక్టు నాణ్యతను దెబ్బతీశారని, ఇప్పుడు కేటీఆర్ కూడా అదే అహంభావంతో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఎన్‌డీఎస్‌ఏ, సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా బ్యారేజీలను నిర్వహించడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. ఎన్‌డీఎస్‌ఏ గుర్తించిన లోపాలను సరిచేయకుండా నీటిని నిల్వ చేయడం అశాస్త్రీయమని, ప్రమాదకరమని హెచ్చరించారు.
త్వరలో సాంకేతిక పరీక్షలు నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రజల ప్రాణాలు, ప్రజాధనాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యమని పేర్కొన్నారు. ప్రజల నీటి సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని అశాస్త్రీయంగా ప్రాజెక్టు నిర్మించి పనికిరాకుండా చేసిన బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. వారం రోజుల్లో నీళ్లు ఇస్తామంటున్న కేటీఆర్, తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన అక్రమాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే మంచిదని, లేకపోతే ప్రజలు బీఆర్ఎస్ నేతలను నిలదీస్తారని హెచ్చరించారు.
