జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం: మహేష్ కుమార్ గౌడ్ 

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ నివాళి

హైదరాబాద్ వెలుతురు జూలై 07:

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ పాలనకు కేంద్రబిందువుగా ఉండాలని ఆచరణలో చూపించిన అరుదైన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ఆయన రాజకీయ తత్వమని అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం వైఎస్సార్ నాయకత్వ విశిష్టత అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 అత్యవసర అంబులెన్స్ సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ గృహాలు, జలయజ్ఞం వంటి పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, సంక్షేమాన్ని పాలనా విధానంగా మలచడం ద్వారా వైఎస్సార్ దేశ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు. ప్రజా సంక్షేమానికి అంకితమైన ఆయన సేవలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ప్రజా సేవ పట్ల అంకితభావం, పేదల పట్ల అపారమైన నిబద్ధత, సమాజంలోని ప్రతి వర్గం అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రజానేత వైఎస్సార్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కట్టుబడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.