ఘనంగా ముగిసిన తెలంగాణ ప్రజాకళ సాంస్కృతిక మహోత్సవాలు

విజయవంతంగా 101 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు

”లాంగెస్ట్ కంటిన్యూయస్ కల్చరల్ మారథాన్” గా గుర్తిస్తూ తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్‌లో చోటు

హైదరాబాద్ వెలుతురు జూలై 10:

తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతి పాల్కురికి సోమన్న మూల వేదికపై 2026 ఏప్రిల్ 1న ప్రారంభమైన “తెలంగాణ ప్రజాకళ” 99 రోజుల సాంస్కృతిక మహోత్సవాలు ప్రేక్షకుల విశేష ఆదరణతో మరో రెండు రోజుల పాటు పొడిగించబడి, జూలై 10 నాటికి విజయవంతంగా 101వ రోజుకు చేరుకొని ముగింపు వేడుకలు తెలంగాణ జానపద సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబిస్తూ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణీ ప్రసాద్, ఐఏఎస్ “ప్రజాకవిత” గ్రంథాన్ని, ”ముద్దొచ్చె ముద్దొచ్చె హైదరాబాదు” & ”తెలంగాణ ప్రజాకళ” ప్రత్యేక గీతాల సీడీని  తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్ , భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ ప్రజాకళ” 99 రోజుల సాంస్కృతిక మహోత్సవాలకు ప్రేక్షకుల విశేష ఆదరణ, కళాకారుల డిమాండ్ తో మరో రెండు రోజుల పాటు పొడిగించబడి, జూలై 10 నాటికి విజయవంతంగా 101వ రోజుకు చేరుకున్నాయని అన్నారు. తెలంగాణ ప్రజాకళ ఆలోచన పుట్టడానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి సహకరించిన సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణీ ప్రసాద్, ఐఏఎస్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్ మాట్లాడుతూ “తెలంగాణ ప్రజాకళ” లను 101 రోజుల పాటు తమ కళలను ప్రదర్శించి విజయవంతం చేసిన కళాకారులను అభినందించారు. తెలంగాణ మారుమూలాల గ్రామాలలోని కళాకారులను గుర్తించి వారిని రవీంద్రభారతి వేదికపై తమ కళలను ప్రదర్శించే అవకాశం కల్పించడం అభినందనీయం అన్నారు.

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. వాణీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాలను 101 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించిన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డిని అభినందించారు. “ఎక్కడైతే కవులు, కళాకారులు గౌరవించబడతారో అక్కడ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది” అని పేర్కొంటూ, కళాకారుల సేవలను ప్రశంసించారు. తెలంగాణ కళలకు పుట్టినిల్లు అని, కళాకారులను ప్రోత్సహించడం, గుర్తింపునివ్వడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళారూపాల పరిరక్షణకు అంకితభావంతో పని చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణ ప్రజాకళ సాంస్కృతిక మహోత్సవాలు విజయవంతంగా 101 రోజుల పాటు నిర్వహించునందుకు ”లాంగెస్ట్ కంటిన్యూయస్ కల్చరల్ మారథాన్” గా గుర్తిస్తూ తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు పి. నర్సింలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డా. పి. విజయ్ కుమార్, సాంస్కృతిక సలహా మండలి సభ్యులు ముచర్ల దినకర్, పల్లె నర్సింహా, ఖాజా పాషా, భాషా సాంస్కృతిక శాఖ అధికారులు & సిబ్బంది, సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.