* ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆషాడ బోనాల జాతరను భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా అత్యంత వైభవంగా నిర్వహించాలి
* లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు సేవలు అందించడంలో సంబంధిత విభాగాలన్నీ సహనంతో, సంయమనంతో వ్యవహరించాలి
* పిల్లలు, బాలింతలు, గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి
* బోనాలు సమర్పించేందుకు తరలివచ్చే శివసత్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలి
* విఐపి, వివిఐపిలకు దర్శనం కల్పించడంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన కార్యాచరణను అమలు చేయండి
* సీఎం రేవంత్ రెడ్డిగారు ఈ యేడాది బోనాల నిర్వహణకు రూ. 20 కోట్లు కేటాయించడం హర్షణీయం
* సీఎం గారి సూచనలకు అనుగుణంగా ఈ యేడాది బోనాల ఉత్సవాలను దేదీప్యమానంగా నిర్వహించాలి
* సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సన్నాహక సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీచేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ
హైదరాబాద్ వెలుతురు జూలై 10:
తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటిచెప్పే బోనాల జాతర రాష్ట్ర ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్తున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అన్నారు. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన సికింద్రాబాద్ ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరను భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత ఘనంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం రోజున సికింద్రాబాద్ లోని ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ బోనాల జాతర ఏర్పాట్లపై దేవాదాయశాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సురేఖ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఇతర శాఖల అధికారులు జాతర ఏర్పాట్లపై మంత్రి సురేఖ గారికి వివరించగా, మంత్రి సురేఖ వారికి సలహాలు, సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, దేవాదాయ శాఖ డైరక్టర్ హనుమంతరావు, డిసిపి (సికింద్రాబాద్ జోన్) రక్షితా కృష్ణ మూర్తి, అడిషనల్ డిసిపి (ట్రాఫిక్) రాములు, సాంస్కృతిక శాఖ డైరక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, దేవాదాయ శాఖ ఆర్జెసి రామకృష్ణారావు, డిసి వినోద్ రెడ్డి, ఎసిలు మనోహర్ రెడ్డి, శ్రీనివాస్, జిహెచ్ఎంసి, ఐ అండ్ పిఆర్, వైద్యారోగ్యశాఖ, ఆర్ అండ్ బి, పోలీస్, విద్యుత్, అగ్నిమాపక శాఖ, టిజిఆర్టిసి తదితర శాఖలకు చెందిన అధికారులు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కోట నీలిమ, దేవాలయ కమిటి సభ్యులు, దక్కన్ మానవ సేవా సమితి, నల్లగుట్ట అభివృద్ధి సంఘం, మన్నూరు కాపు సంఘం, ఆర్యవైశ్య సేవా సమితిలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ గారు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన బోనాల జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.
బోనాల జాతర సందర్భంగా జూలై 19న ఘటం ఎదుర్కోలు, ఆగస్టు 2న బోనాల ఉత్సవాలు, ఆగస్టు 3న రంగం (భవిష్యవాణి), గజారోహణ మహోత్సవం కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహించాలని మంత్రి సురేఖ ఆదేశించారు. జూలై 19 న ఘటోత్సవముల ప్రారంభం నుంచి ఆగష్టు 3న రంగం కార్యక్రమం వరకు అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరాంగ తీర్చిదిద్దాలని మంత్రి సురేఖ దేవాదాయ శాఖకు సూచించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, దివ్యాంగులకు, పిల్లలు, బాలింతలు, గర్భిణులకు ప్రత్యేక క్యూ లైన్లు, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. బోనాల ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు, బోనాలు సమర్పించేందుకు వచ్చే శివసత్తులకు ప్రత్యేక క్యూలైన్, సులభ దర్శనం, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. గత బోనాల ఉత్సవాల్లో వారి నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు.
“ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీక. భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. అందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటున్నది” అని మంత్రి సురేఖ పేర్కొన్నారు.
ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించి, పూలతో సుందరంగా తీర్చిదిద్దాలని, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణ, నిరంతర విద్యుత్ సరఫరా, సీసీ కెమెరాలు, పటిష్ట పోలీసు బందోబస్తు వంటి అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. లక్షలాదిగా భక్తులు తరలివచ్చే పరిస్థితుల్లో, బోనాల సమర్పించేందుకు భక్తులు తీసుకువచ్చే దీపాల కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. అన్ని దేవాలయాల వద్ద తగిన అగ్నిమాపక పరికరాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు
అదే విధంగా దేవాదాయ శాఖ భక్తులకు లడ్డూలు, వడలు, పులిహోర ప్రసాదాలను నిరంతరాయంగా అందుబాటులో ఉంచాలని, సమాచార, ప్రసార సబంధాల శాఖ జాతర ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా భక్తులకు సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నిరంతరాయంగా లైవ్ ప్రసారాలు చేపట్టాలని, దేవాలయ పరిసరాల్లో స్క్రీన్ లు ఏర్పాట్లు చేసి ప్రత్యక్ష ప్రసారాలు చేయాలని సూచించారు.
దేవాదాయ శాఖ డైరక్టర్ హనుమంత రావు మాట్లాడుతూ మంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని శాఖలు కలసికట్టుగా పనిచేసి జాతరను దిగ్విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. పోలీసుశాఖతో పాటు ఇతర శాఖలు బోనాల ఉత్సవ బాధ్యతను విధులుగా పరిగణించకుండా అమ్మవారికి సేవగా భావించి నిర్వర్తించాలని డిసిపి రక్షితా కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. సాంస్కృతిక శాఖ చేపట్టనున్న సాంస్కృతిక కార్యక్రమాలను ఆ శాఖ డైరక్టర్ వివరించారు. ఈ సందర్భంగా దక్కన్ మానవ సేవా సమితి, ఆర్యవైశ్య సంఘం తదితర సంస్థల ప్రతినిధులు చేసిన సూచనలను కార్యరూపంలోకి తీసుకురావలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు.
సన్నాహక సమావేశం కోసం దేవాలయానికి చేరుకున్న మంత్రి సురేఖ గారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి సురేఖ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సన్నాహక సమావేశం తర్వాత మంత్రి అధికారులతో కలిసి ఉజ్జయిని మహంకాళి బోనాల పోస్టర్ ను ఆవిష్కరించారు.
