దేవాదుల పనులకు రూ.146 కోట్లు విడుదల: భట్టి విక్రమార్క

  • పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
  • కాళేశ్వరం దెబ్బతినడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శ
  • నిపుణుల సూచనల మేరకే ప్రాజెక్టుల పూర్తి: ఉప ముఖ్యమంత్రి

హైదరాబాద్ వెలుతురు జూలై 13:

గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో నిపుణులు, ఇంజనీర్ల సూచనలను పక్కనబెట్టి ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్లడం వల్లే కాళేశ్వరం బ్యారేజీలు నిర్మాణం పూర్తయిన కొద్ది కాలంలోనే దెబ్బతిన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా నిర్వహించి, ఇప్పుడు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు.

దేవాదుల ప్రాజెక్టులో పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులు, పెండింగ్ పనుల కోసం తక్షణమే రూ.146 కోట్లను విడుదల చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని చెప్పారు.

ప్రస్తుత ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని నిపుణుల సాంకేతిక సూచనలు, ఇంజనీర్ల సిఫార్సుల ఆధారంగానే తీసుకుంటోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ చేపడుతున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రానికి అత్యంత కీలకమైన దేవాదుల, సీతారామ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించడంతో పాటు ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేయడమే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.

ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రజాధనం ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.