కేసీఆర్ కు ఓటు వేయాలనే ఆలోచనలో ప్రజలున్నారు..
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 23 : గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. అడ్డమైన మాటలు, అడ్డమైన ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన అంబర్‌పేటలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కరెంట్ లేక రైతులు గోస పడుతున్నారు. తాగునీటికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ నిండా ముంచిందని మండిపడ్డారు. పరిపాలన చేతకాక ప్రజలకు ఏమీ చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఎల్‌నినో ప్రభావంపై 10 నెలల ముందే ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పక్క రాష్ట్రాలు, దిగువ రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రాజెక్టులను నింపుకున్నాయనీ అన్నారు.
