జహీరాబాద్ బైపాస్‌లో ఘోర ప్రమాదం.. దంపతులు దుర్మరణం
కుమారుడిని విమానాశ్రయంలో దించి తిరిగొస్తుండగా ఘటన
జహీరాబాద్, వెలుతురు, నవంబర్ 24: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులోని అల్గోల్ చౌరస్తా వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న కోళ్ల వ్యాన్‌ను కారు బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఉమర్గా ప్రాంతం మురుము గ్రామానికి చెందిన శరణప్ప, సుష్మ దంపతులు తమ కుమారుడిని నేపాల్‌కు పంపించేందుకు హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్లి, విమానం ఎక్కించిన అనంతరం తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో జహీరాబాద్ బైపాస్‌లోని అల్గోల్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న కోళ్ల వ్యాన్‌ను వారి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతదేహాలను జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో మృతుల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
