హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 18:
తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(టీజీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో జరిగిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డుల ప్రదానోత్సవానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా లఘచిత్రాలు, బతుకమ్మ పాటలు, జానపదగీతాలు, ఇన్ఫ్లుయెన్సర్లు, ఆర్టికల్స్ విభాగాల కింద దర్శకుడు హరీష్ శంకర్ నేతృత్వంలోని జ్యూరీ ఎంపిక చేసిన మొత్తం 29మంది విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యువతలో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్డీసీ) చైర్మన్ దిల్ రాజు నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం వర్ధమాన చిత్రనిర్మాతలకు తమ ప్రతిభను చాటుకునేందుకు గొప్ప వేదికగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ పోటీలో సుమారు 2,600కు పైగా ఎంట్రీలు రావడం తెలంగాణ యువతలోని సృజనాత్మక శక్తికి నిదర్శనమన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, హైదరాబాద్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ చలనచిత్ర నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
సినిమా అనేది కేవలం వినోద సాధనం మాత్రమే కాదని, సమాజంలో మార్పు తీసుకురాగల శక్తివంతమైన మాధ్యమమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, సూపర్ ఎల్ నినో ప్రభావాలు, నీటి సంరక్షణ వంటి కీలక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా యువ చిత్రనిర్మాతలు తమ సృజనాత్మకతను వినియోగించుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో విద్యనభ్యసించిన కళాభిమానిగా సృజనాత్మక రంగాల అభివృద్ధిపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారని తెలిపారు. యువ కళాకారులను ప్రోత్సహించడం, వారికి తగిన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో భాగమని అన్నారు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి చలనచిత్ర నిర్మాణ సంస్థలు, స్టూడియోలను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, తద్వారా నగరానికి ప్రపంచ సినిమా రంగంలో మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న అపారమైన ప్రతిభ, సాంకేతిక సామర్థ్యం, సృజనాత్మక వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి సినిమా కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వివరించారు. అనంతరం ”ప్రజా పాలనలో నవశకం” పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ కొండా రాజును, బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ బృందాన్ని, టీజీఎఫ్డీసీ సిబ్బందిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, టీజీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, కార్పొరేషన్ ఛైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల గద్దర్, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ కొండా రాజు, టీజీఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. ముకుంద రెడ్డి, ఎఫ్డీసీ ఈడీ కిషోర్ బాబు, బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.మామిడి హరికృష్ణ, నటి అనుపమ పరమేశ్వరన్, సీనియర్ నటుడు నరేష్, జాతీయ అవార్డు గ్రహీత శ్యామ్ కాసర్ల, పీజీ విందా, రచ్చ రవి, విమలక్క, అంతడుపుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
లఘుచిత్రాల విభాగం
– ప్రథమ బహుమతి: ‘యక్షగానం’ – రామ్ తలైవి (రూ.3 లక్షలు)
– ద్వితీయ బహుమతి: ‘నా ఇంటి బతుకమ్మ’ – అభివన్ సందబోయిన (రూ.2 లక్షలు)
– తృతీయ బహుమతి: ‘ఇల్లు వెలుగు’ – ప్రభువన్ రాజ్ (రూ.1 లక్ష)
బతుకమ్మ పాటల విభాగం
– ప్రథమ బహుమతి: ‘బతుకమ్మ పాట 2026’ – వరం (రూ.3 లక్షలు)
– ద్వితీయ బహుమతి: ‘తలెత్తుకుంది బతుకమ్మ’ – అశ్విని రాథోడ్ (రూ.2 లక్షలు)
– తృతీయ బహుమతి: ‘బజ్జి బతుకమ్మ’ – మనీషా పటేల్ దొడ్లే (రూ.1 లక్ష)
జానపద గీతాల విభాగం
– ప్రథమ బహుమతి: ‘వన్ రాంగ్ స్టెప్’ – డా. కుమారస్వామి (రూ.3 లక్షలు)
– ద్వితీయ బహుమతి: ‘అమ్మ నవ్వింది’ – శ్రీను ముదిరాజ్ (రూ.2 లక్షలు)
– తృతీయ బహుమతి: ‘ఇది మాయేనా’ – వంశీ చారి (రూ.1 లక్ష)
వ్యాసాల విభాగం
– ప్రథమ బహుమతి: ‘వెయ్యి రోజుల వెలుగు రేఖలు’ – వినీల్ కాంత్ మానవరపు (రూ.1 లక్ష)
– ద్వితీయ బహుమతి: ‘హైదరాబాద్ హైడ్రా’ – పిల్లి పద్మ యాదవ్ (రూ.50 వేలు)
– తృతీయ బహుమతి: ‘మా అమ్మ మహాలక్ష్మి’ – బెన్ రాజ్ బకారం (రూ.30 వేలు)
ఇన్ఫ్లుయెన్సర్ వీడియోల విభాగం
– ప్రథమ బహుమతి: ‘పెత్తరమాస’ – ప్రసాద్ హైడ్రాబోయిని (రూ.1 లక్ష)
– ద్వితీయ బహుమతి: ‘ప్రజా పాలన ప్రభుత్వ పథకాలు’ – హర్షిని మేకల (రూ.50 వేలు)
– తృతీయ బహుమతి: ‘హిస్టరీ & కల్చర్ ఆఫ్ తెలంగాణ’ – పిట్టల శ్రవణ్ (రూ.30 వేలు)








