కేటీఆర్‌ తప్పుడు ప్రచార బాగోతాన్ని ఆధారాలతో బయటపెడతా: బల్మూర్‌ వెంకట్‌

కేటీఆర్‌ తప్పుడు ప్రచార బాగోతాన్ని ఆధారాలతో బయటపెడతా: బల్మూర్‌ వెంకట్‌

 

హైదరాబాద్, వెలుతురు అక్టోబర్ 24 :  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహిస్తే సహించేది లేదని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ డాక్టర్‌ బల్మూర్‌ వెంకట్‌ హెచ్చరించారు. తనపై రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు ప్రచారానికి సంబంధించిన అంశాలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతానని స్పష్టం చేశారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 

కేటీఆర్‌ తన హెయిర్‌ స్టైల్‌, గడ్డం, దుస్తుల శైలిని మార్చుకోవడం కంటే ముందుగా తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని వెంకట్‌ సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అనుకరిస్తే ఆయనలా ముఖ్యమంత్రి కాలేరని వ్యాఖ్యానించారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి కాలేదని ఎద్దేవా చేశారు. దసరా పండుగ సందర్భంగా కొంత విరామం ఇచ్చానని, ఇకపై కేటీఆర్‌ వ్యవహారాలను వరుసగా బయటపెడుతూనే ఉంటానని అన్నారు.

 

దుబాయ్‌ కేంద్రంగా కేటీఆర్‌, ఆయన బృందం సామాజిక మాధ్యమాల ద్వారా బ్లాక్‌మెయిల్‌, తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని బల్మూర్‌ వెంకట్‌ ఆరోపించారు. కొండూరి సంకేత్‌తో పాటు నితిన్‌, దిలీప్‌, అనిల్‌ తదితరుల పేర్లను ప్రస్తావిస్తూ, యూట్యూబ్‌ ఛానళ్లకు ప్రతి నెలా రూ.1.08 కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎలిగెంట్‌ కంపెనీ, డెక్కన్‌ సరాయ్‌ హోటల్‌ కేంద్రంగా నిధుల పంపిణీ జరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని బయటపెడతానని చెప్పారు.

 

తనపై ఇప్పటివరకు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పే ధైర్యం కేటీఆర్‌కు లేదని విమర్శించారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమైతే కేటీఆర్‌ స్వయంగా విలేకరుల సమావేశం నిర్వహించి వాస్తవాలను ప్రజలకు వివరించాలని సవాల్‌ విసిరారు. అవసరమైతే చట్టపరంగా ఎదుర్కోవాలని సూచించారు.

 

పాఠశాల, కళాశాల రోజుల్లో స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలను సైతం వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని వెంకట్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారం వల్ల ఇతర కుటుంబాలకు చెందిన పిల్లల వ్యక్తిగత చిత్రాలు కూడా దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో ఉన్నవారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు.

 

తాను ఒక యువకుడిగా, తెలంగాణ సగటు యువకుడి తరఫున సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రశ్నిస్తున్నానని తెలిపారు. రాజకీయ విమర్శలకు వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. కేటీఆర్‌కు సంబంధించిన అంశాలను ఆధారాలతో సహా బయటపెడితే ఆయన ప్రజల ముందు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని బల్మూర్‌ వెంకట్‌ వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.