- పర్యాటక అభివృద్ధిపై సీఎం ఫోకస్.. ప్రాజెక్టుల వేగవంతానికి ఆదేశాలు
- రాష్ట్ర పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష
- హైదరాబాద్ అటవీ భూముల్లో ఎకో టూరిజం అభివృద్ధికి కార్యాచరణ చేపట్టాలని ఆదేశాలు
- భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక
- గుర్రంగూడ తరహాలో నగరంలో మరిన్ని ఎకో పార్కుల అభివృద్ధికి సూచనలు
- తారామతి బారాదరి, దుర్గం చెరువును ఆకర్షణీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆదేశం
- మంజీరా, దిల్‌కుషా అతిథి గృహాల ఆధునికీకరణపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం
- వికారాబాద్ శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయం
- పురానాపూల్ వంటి వారసత్వ వంతెనలను పర్యాటక ప్రాంతాలుగా మార్చే ప్రణాళిక
- ఎకో టూరిజం ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక అధికారుల నియామకంపై ఆదేశాలు
- డిసెంబర్‌లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలని సూచన
హైదరాబాద్ వెలుతురు జూలై 06:
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సోమవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంత పరిధిలోని అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో సమన్వయం చేసి ఎకో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దాలని, గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో మరిన్ని ఎకో పార్కులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం స్పష్టం చేశారు. తారామతి బారాదరిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. మంజీరా, దిల్‌కుషా అతిథి గృహాలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
టూరిజం హబ్ డెవలప్‌మెంట్ పథకం కింద వికారాబాద్‌ను ప్రత్యేక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా అక్కడి శ్రీ వీరభద్రస్వామి దేవాలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసి, ఆలయ నిర్వహణ కోసం ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సీ.యూ.ఆర్.ఈ (CURE) పరిధిలో అర్బన్ ఫారెస్ట్ నమూనాలో ఎకో టూరిజం ప్రాజెక్టులను చేపట్టాలని, వాటి అమలుకు ప్రత్యేక అధికారులను నియమించి పనులను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. నగరంలో చారిత్రక వారసత్వ సంపదగా నిలిచిన పురానాపూల్ వంటి వంతెనలను సంరక్షిస్తూ పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని, అవసరమైతే ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించి పర్యాటకులకు అనువైన వాతావరణం కల్పించాలని అధికారులకు ఆదేశించారు.
పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు వచ్చే డిసెంబర్‌లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలని సీఎం సూచించారు. ఇందుకోసం వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
